రాజ్యసభకు రాజమౌళి తండ్రి నామినేట్

Wed Jul 06 2022 21:28:36 GMT+0530 (India Standard Time)

vijayendra prasad nominated for rajya sabha

దక్షిణ భారత సినిమాకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి బ్లాక్ బస్టర్ కథా చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.1400 చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజాకు రాజ్యసభ బెర్తు ఇవ్వడం పెద్దగా ఎవ్వరినీ ఆశ్చర్యపరచలేదు. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు మాత్రం రాజ్యసభ సీటు ఇవ్వడం అనూహ్యమేనని చెప్పాలి. దీనిపై అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే బాహుబలి-1 బాహుబలి-2 సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భజరంగీ బాయిజాన్ మగధీర యమదొంగ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు

ముఖ్యంగా బాహుబలి 1 2 భాగాలు ఆర్ఆర్ఆర్ సినిమాలు రికార్డు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దుమ్ములేపాయి. తద్వారా ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టారు. కేవలం టాలీవుడ్ కే కాకుండా బాలీవుడ్ కు సైతం అద్భుతమైన కథలు అందించారు. కోలీవుడ్ లో ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన మెర్సల్ చిత్రానికి కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందించారు.

మరోవైపు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రుల వరకు బాహుబలి భళ్లాలదేవ కట్టప్ప వంటి పదాలను సందర్భోచితంగా విరివిగా వాడటం తెలిసిందే. తన అద్భుతమైన కథలతో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చడమే కాకుండా వేల కోట్ల రూపాయలు వసూలు చేసే స్థాయికి చేర్చారు. తన కుమారుడు రాజమౌళితో కలిసి ప్రపంచమంతా ఎదురుచూసే సినిమాలకు అద్భుతమైన కథను అందించారు.

ప్రధాని నరేంద్రమోడీ పలుమార్లు హైదరాబాద్ సందర్శించినప్పుడు ప్రసంగాల్లోనూ బాహుబలి ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలను ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే దక్షిణ భారతదేశంలో ఒక్క కర్ణాటకలో మినహా బీజేపీకి ఎక్కడా అంతగా పట్టు లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ఉద్దేశంతోనే రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ను నామినేట్ చేశారని చెబుతున్నారు. ఈ లక్ష్యంతోనే ఇటీవల మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరించి తెలుగువారి హృదయాలను దోచుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

ఇక ఇళయరాజా ఒకటి రెండు కాదు కొన్ని వందల చిత్రాలకు అజరామర సంగీతం అందించారు. ఆయన సంగీతంతో పిన్న పెద్దలు వృద్ధులు యువత తేడా లేకుండా ఆబాలగోపాలాన్ని అలరించారు. ఈ నేపథ్యంలోనే ఇళయరాజాకు కూడా రాజ్యసభ బెర్తు దక్కింది. తెలుగు తమిళం మలయాలం కన్నడం ఇలా ఎన్నో భాషల్లో వేల పాటలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. తమిళనాడుకు చెందిన ఇళయరాజాకు ఏపీకి చెందిన విజయేంద్ర ప్రసాద్ లను రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక బీజేపీ దక్షిణాదిలో విస్తరించాలనే వ్యూహం దాగుందని అంటున్నారు.

ఇక పరుగుల రాణి పీటీ ఉష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏషియన్ గేమ్స్ కామన్ వెల్త్ గేమ్సులో ఆమె 400 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణాలు కొల్లగొట్టారు. పీటీ ఉష కూడా దక్షిణ భారతదేశానికి చెందినవారే కావడం గమనార్హం. పీటీ ఉషది కూడా కేరళ కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల నుంచి విజయేంద్ర ప్రసాద్ కేరళ నుంచి పీటీ ఉష తమిళనాడు నుంచి ఇళయరాజాలను రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక బీజేపీ వ్యూహం దాగి ఉందని అంటున్నారు.