Begin typing your search above and press return to search.

రాహుల్ హత్య : సత్యం కనుసన్నల్లోనే ...నేర చరిత్ర ఇదే !

By:  Tupaki Desk   |   24 Aug 2021 1:30 PM GMT
రాహుల్ హత్య : సత్యం కనుసన్నల్లోనే ...నేర చరిత్ర ఇదే !
X
యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ ను ఆదివారం అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. తాజాగా, సోమవారం ఈ హత్య కేసులో మరో నిందితుడు కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ఏ1 కాగా, అతడి భార్య పద్మజ ఏ2, మరో మహిళ గాయత్రి ఏ3, కోగంటి సత్యం నాలుగో నిందితుడిగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కోగంటి సత్యం.. ఖాళీ సీసాలు అమ్మే దగ్గర నుంచి కోట్లాది రూపాయల సంపాదనకు ఎదిగాడు. కోగంటి సత్యం నేర చరిత్ర అంతా ఇంతా కాదు. 2019లో పంజాగుట్టలో జరిగిన స్టీల్‌ వ్యాపారి రామ్‌ ప్రసాద్ మర్డర్‌, రెండోది మొన్నీ మధ్య విజయవాడలో జరిగిన రాహుల్ మర్డర్‌. ఈ రెండింటిలో ఈయనపేరే చాలా గట్టిగా వినిపిస్తోంది.

అదేంటీ అంటే.. నేను అమాయకుడ్ని, నాకేం తెలీదు అంటూ కబుర్లు చెప్పాడు కోగంటి. విజయవాడలోనే అతడిపై 30 కేసుల వరకు నమోదయ్యాయి. కోగంటి క్రైమ్‌ హిస్టరీలో మరో మర్డర్‌ కేసు కూడా యాడ్ అయ్యింది. విజయవాడ రాహుల్ హత్యకు ముందు A1 విజయ్‌ కు క్రైమ్ పాఠాలు చెప్పింది రౌడీ షీటర్ కోగంటి సత్యమే అన్నది దాదాపుగా రుజువైంది. అందుకే A4గా ఉన్న కోగంటిని వెతికి వెతికి మరీ బెంగళూరులో పట్టుకున్నారు పోలీసులు. అయితే, అంతకుముందు అయన మీడియా తో మాట్లాడుతూ నాకేం తెలియదు , నాకేం సంబంధం అని ఎంతో బుద్ది మంతుడిలా మాట్లాడారు.

కొద్దిసేపటి క్రితం ఆయన్ను విజయవాడకూ తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోగంటి ప్లాన్, ఎగ్జిక్యూషన్ ప్రకారమే రాహుల్ మర్డర్ జరిగింది. రాహుల్ హత్యకు మూడు రోజుల ముందు కోరాడ విజయ్‌తో కోగంటి చాలాసార్లు ఫోన్లు మాట్లాడినట్లు గుర్తించాడు. మర్డర్ ఎలా చెయ్యాలి. ఎక్కడికి పారిపోవాలి. ఆ తర్వాత పద్ధతిగా ఎలా లొంగిపోవాలి. ఇలా అన్నింటినీ ఓ పాఠంలా చెప్పాడట కోగంటి. ఆ తర్వాత తాను విజయవాడలోనే ఉంటూ జరుగుతున్న కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ ని చూస్తూ వచ్చాడు. వ్యాపార లావాదేవీలే ఈ మర్డర్‌కు కారణం . రాహుల్ స్థాపించిన జిక్సిన్ కంపెనీయే మర్డర్ కు మొయిన్ రీజన్ గా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఆర్థిక కష్టాల కారణంగా కంపెనీలోని తన వాటాను అమ్మాలని భావించాడు విజయ్ కుమార్. ఆ వాటాను తాను తీసుకోవాలన్నాడు కోగంటి సత్యం. కానీ ఇందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దీంతో అతడి మర్డర్‌ కు స్కెచ్ వేశారు, అమలు చేశారు. ఓ మనిషిని చంపేశారు. రాహుల్ మర్డర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే, ముగ్గురు మహిళల పాత్ర. వాళ్లలో ఇద్దరు పద్మజ పేర్లతో ఉన్న మహిళలైతే మరొకరు గాయత్రి. విజయ్‌ కుమార్‌, రాహుల్‌కి పార్టనర్‌. ఒక పద్మజ, విజయ్‌కి భార్య. మరి మరో పద్మజ ఎవరు, గాయత్రి అనే మహిళకూ రాహుల్‌ మర్డర్‌కి లింకేంటి , ఇవన్నీ ప్రస్తుతానికి మిస్టరీ. అయితే ఇందులో గాయత్రి అనే మహిళ దగ్గర రాహుల్ ఆరు కోట్లు తీసుకున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

వ్యాపారవేత్తలకు అతనొక బడా బిజినెస్ మ్యాన్. కానీ, పోలీస్ రికార్డుల్లో మాత్రం అతడో రౌడీషీటర్. అతడే కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. కన్నింగ్‌కు కేరాఫ్ అడ్రస్, బెజవాడలో సత్యం గారిదొడ్డి అంటే అక్రమాలకు అడ్డా, ఎన్నో నేరాలు, మరెన్నో హత్యలు, అంతకుమించి మోసాలు. ఇదీ స్థూలంగా కోగంటి సత్యం చరిత్ర. కోగంటి సత్యం తొలినాళ్లలో పాత సీసాలు ఏరుకొనే వాళ్ల దగ్గర నుంచి సీసాలు కొని అమ్ముకునేవాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో ఎన్నో నేరాలు చేశాడు. రౌడీషీటర్ ముద్ర పోగొట్టుకునేందుకు పారిశ్రామికవేత్త అవతారం ఎత్తాడు.

కోగంటి సత్యం రౌడీయిజానికి మంగళగిరిలోనే బీజం పడింది. 1984-85లో నాటి మంగళగిరి సర్పంచ్‌పై తొలిసారి కోగంటి సత్యం, అతడి అనుచరులు హత్యాయత్నం చేశారు. తాడేపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో సర్పంచ్‌పై దాడి చేసి అతడు మరణించాడని కృష్ణానదిలోకి విసిరేశారు. అయితే, అతడు అప్పటికప్పుడే మరణించకపోయినా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఆ కేసులోనే తొలిసారిగా కోగంటి సత్యంపై మర్డర్ కేసు నమోదైంది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి కృష్ణలంక తన మకాం మార్చాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. నేరాలు ఇచ్చిన ధీమాతో కాబోలు.. ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేస్తూనే కోగంటి సత్యం మెల్లమెల్లగా ఎదిగాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బిషప్ భగవాన్‌దాస్ హత్య కేసులోనూ కోగంటి సత్యమే ప్రధాన నిందితుడు. 1988 మార్చి 12న గాంధీనగర్ ఊర్వసి థియేటర్ దగ్గర నేతల భగవాన్ దాసును కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. 1988లో విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ హయాంలో కోగంటి సత్యంపై రౌడీషీట్ ఓపెన్ చేసారు. అదే సంవత్సరం వంగవీటి రంగా హత్య జరిగింది. రంగా హత్యానంతరం ఆయన అనుచరులు అందరినీ కోగంటి సత్యం చేరదీశాడనే టాక్ ఉంది. సినీ నటి వహీదా రెహ్మాన్‌ కు చెందిన భూమి కబ్జా విషయంలోనూ కోగంటిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై వహీదా విజయవాడలో కేసు పెట్టారు. బెంజి సర్కిల్ వద్ద ఉన్న వహీదాకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూమి నేటికీ కోగంటి సత్యం కబంధ హస్తాల్లోనే ఉందని చెబుతారు. ఇలా కోగంటి సత్యంపై ఒక్క విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 30 కేసుల వరకు ఉన్నాయి.