Begin typing your search above and press return to search.

ఎన్జీవోలకు బెజవాడ, గుంటూరు ఉద్యోగుల షాక్

By:  Tupaki Desk   |   13 Aug 2015 5:57 AM GMT
ఎన్జీవోలకు బెజవాడ, గుంటూరు ఉద్యోగుల షాక్
X
రాష్ట్ర విభజన జరిగి 14 నెలలు అవుతున్నా.. ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అనే వాళ్లల్లో హైదరాబాద్ లోని ఏపీ ఉద్యోగులు. వారిలో కొందరు తప్పించి.. మిగిలిన వారంతా వీలైనంత వరకూ హైదరాబాద్ లోనే కాలం గడపాలనుకునే వారే. ప్రజలు ఎక్కడ ఉంటే.. అక్కడే ప్రభుత్వం ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని మర్చిపోయిన ఏపీ ఎన్జీవోలు.. తమ స్వార్థం కోసమే వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది.

ఫోన్ ట్యాపింగ్.. ఓటుకు నోటు ఉదంతం అనంతరం ఏపీ నుంచి పాలన చేసేందుకు మక్కువ చూపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ ఎన్జీవోల నుంచి వస్తున్న స్పందన మింగుడుపడనిదిగా మారింది.

వారంలో నాలుగు రోజులు ఏపీ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా.. హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఉద్యోగులు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నమైన ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితి.

మరో ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే.. ఏపీ రాజధానికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులు ఎప్పటికి తరలి వెళతారన్న మాట మీద కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యలో వారంతా ఎప్పటికి ఏపీ రాజధానికి చేరతారన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో తిష్ట వేసుకొని.. అక్కడి నుంచి కదలి రావటానికి ఇబ్బంది పడుతున్నఏపీ ఎన్జీవోలకు విజయవాడ.. గుంటూరు ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని షాక్ ఇచ్చారు. తమకు కానీ.. డిప్యూటేషన్ మీద సెక్రటేరియట్ బాధ్యతలు అప్పగిస్తే.. తాము చేయటానికి సిద్ధమని.. తాము చేసే పనుల్ని హైదరాబాద్ నుంచి రాని వారికి అప్పగించాలని కోరుతున్నారు.

ఈ పరిణామంతో బిత్తర పోయిన ఏపీ ఎన్జీవోలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడ.. గుంటూరు ప్రభుత్వ ఉద్యోగుల మాటకు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతరో చూడాలి.