Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకేలోకి విజయశాంతి?

By:  Tupaki Desk   |   18 Dec 2016 9:48 AM GMT
అన్నాడీఎంకేలోకి విజయశాంతి?
X
తమిళనాడు రాజకీయాలు ఎన్నో మలుపులు తిరగుతున్నాయి. అయినా.. పైకి మాత్రం గుంభనంగానే కనిపిస్తున్నాయి. జయలలిత మృతి తరువాత శశికళ ఆ స్థాయిలో తయారవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే... జయ లేని తమిళనాడులో పాగా వేయాలని మిగతా పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలే కాదు.. వ్యక్తులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రాజకీయ దురదృష్టవంతురాలు, అలనాటి అందాల తార విజయశాంతి ఇప్పుడు తమిళనాడుపై కన్నేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కేంద్రంగా గతంలో చాలాకాలంగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న ఆమె ఎంపీగా కూడా గెలిచారు.. కానీ... అనంతరం రాజకీయ తప్పటడుగులతో కెరీర్ పాడుచేసుకున్నారు. ఇప్పుడు ఆమె కొత్తగా తమిళనాడు నుంచి మళ్లీ రాజకీయ జీవితాన్ని నిర్మించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె శశికళను కలిసి ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఆమె ఫొటోల‌ను ఎందుకు విడుద‌ల చేయ‌లేద‌ని - ఆమెకు కుట్రపూరితంగా చంపేశార‌ని సినీన‌టి గౌత‌మి - త‌మిళ‌నాడు నాయ‌కురాలు శ‌శిక‌ళ పుష్ప చేసిన ఆరోప‌ణ‌ల‌పై విజ‌య‌శాంతి స్పందించారు. ఒక ఆడ‌మ‌నిషి అయిన‌ జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ప్పుడు ఆ స్థితిలో ఫొటోలు తీసి ఎలా విడుదల చేస్తార‌ని ప్ర‌శ్నించారు. జ‌య‌మృతి వెనుక కుట్ర దాగుంద‌ని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా జ‌య‌ల‌లిత క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు రాలేదని, కానీ ఇప్పుడు వ‌స్తున్నారని అన్నారు. ఇప్పుడు వ‌చ్చి కొత్తగా మాట్లాడుతుండ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అన్నారు. అంతేకాదు... ఈ విషయంలో ఆమె డీఎంకే అధినేత కరుణానిధిపైనా మండిపడ్డారు. కరుణ కూడా జయలలిత ఫొటోలను విడుదల చేయాలని అన్నారని ఆమె అన్నారు. ఇప్పుడు కరుణానిధి ఆసుప‌త్రిలో ఉన్నారని, మ‌రి ఆయ‌న ఫొటోలను విడుద‌ల చేస్తున్నారా? అని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు.

ఆస్తులు లాక్కొవ‌డానికి శ‌శిక‌ళ వ‌చ్చిందంటూ ఆమెపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఆమె కొట్టివేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని లాక్కునే వ్య‌క్తిలా కూడా శ‌శిక‌ళ క‌నిపించ‌డం లేదని విజ‌య‌శాంతి అన్నారు. తాను ఈ రోజు శశిక‌ళ‌ను క‌లిశాన‌ని, ఆమె చాలా బాధ‌ప‌డుతూ ఉన్న‌ట్లు అనిపించిందని, బ‌య‌ట‌ మాట్లాడుకుంటున్న‌ట్లు ఆ ఉద్దేశం ఆమెలో ఉన్న‌ట్లు త‌న‌కు అనిపించ‌లేదని అన్నారు. శ‌శిక‌ళ‌పై జ‌య‌ల‌లిత అసంతృప్తితో ఉంటే ఆమెను జయలలిత దూరంగానే ఉంచేదని అన్నారు. జ‌య‌ల‌లిత స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి శ‌శిక‌ళే స‌రైన నాయ‌కురాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు విజ‌య‌శాంతి అభిప్రాయ‌ప‌డ్డారు. శ‌శిక‌ళ‌తో ప్రాబ్లం ఏమీ లేద‌ని జ‌య‌ల‌లిత త‌న‌తో గ‌తంలో కొన్నిసార్లు చెప్పార‌ని అన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కి శ‌శిక‌ళ‌కే అన్నాడీఎంకే ప‌గ్గాలు అప్ప‌జెప్పి ముందుకెళితే బెట‌రని చెప్పారు.

కాగా జ‌య‌ల‌లిత‌కు బాగా సన్నిహితంగా ఉండేవారిలో తెలుగు సినీన‌టి, లేడీ అమితాబ్‌ విజ‌య‌శాంతి కూడా ఒక‌రు. 1998 నుంచి జ‌య‌ల‌లితతో ఆమెకు ప‌రిచ‌యం ఉంది. మరోవైపు విజయశాంతి బీజేపీ, టీఆరెస్ పార్టీల్లో క్రియాశీలంగా ఉండేవారు. కానీ.. ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేనాటికి వాటి నుంచి ఆమె వెళ్లిపోయారు. దీంతో ఎప్పుడూ అధికారంలో లేరు. కానీ.. ప్రజల్లో మాత్రం ఆమెకు ఇప్పటికీ మంచి ఛరిష్మా ఉంది. దీంతో మళ్లీ రాజకీయాల్లో అదృష్ణాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నా తెలంగాణలో అది కష్టమేనని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో శశికళ అండతో తమిళనాట అడుగుపెట్టాలని.. వీలైతే రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/