Begin typing your search above and press return to search.

మనీషా రేప్ ఘటనపై విజయశాంతి `ప్రతిఘటన`..వైరల్ పోస్ట్

By:  Tupaki Desk   |   30 Sep 2020 5:00 PM GMT
మనీషా రేప్ ఘటనపై విజయశాంతి `ప్రతిఘటన`..వైరల్ పోస్ట్
X
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో...మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం....' అనే పాట ఎంత పాపులరో మనందరికి తెలిసిందే. కలియుగంలోని దుశ్శాసనుల గురించి ప్రతిఘటన సినిమాలో తన ఆవేదనను పాటగా మలిచాడో సినీకవి. అయితే, యుగం ఏదైనా కొందరు మనుషుల్లోని మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఆ పాట వచ్చి ఇన్నేళ్లయినా...మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా....కామాంధుల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మనీషా ఘటన పెను సంచలనం రేపింది. మనీషా నాలుక కోసి, ఆమె వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నలుగురు మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, యూపీలోనే తన పిల్లలతో కలసి బస్సు ఎక్కిన ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణం గా అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనలపై కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయ శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాను నటించిన `ప్రతిఘటన` సినిమా లోని ఆ పాటను గుర్తు చేస్తూ ఫేస్‌బుక్‌లో విజయశాంతి ఆవేదనపూరిత పోస్ట్ పెట్టారు. దేశంలోని మహిళలపై దారుణాల గురించి విన్నప్పుడల్లా ఈ పాటే తనకు గుర్తుకొస్తుందని విజయశాంతి అన్నారు. నిర్భయ, దిశ ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని, చట్టాలు, పోలీసులు ఉన్నా... నైతికంగా సమాజం శక్తివంతం కానంతవరకూ ఈ ఘోరాలకు అడ్డుకట్ట పడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల పట్ల గౌరవంగా మెలగాలని అబ్బాయిలకు ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలపై జాలి చూపి ఆగిపోవద్దని, రేపటి పౌరులు కూడా ఈ సమాజంలోకి అడుగుపెడతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మన మనుగడకు, జాతి గౌరవానికి మూలం మహిళేనని గుర్తించాలని,మహిళ గర్వపడేలా మన సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మనీషా రేప్ ఘటనపై విజయశాంతి `ప్రతిఘటన` పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.