Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 July 2021 12:30 PM GMT
మోడీ సర్కారుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
X
కేంద్రంలోని మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది ఏళ్లు గడుస్తున్నా.. విభజన చట్టంలోని హామీల్ని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలుగు ప్రజలకు కేంద్రం పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుందన్న ఆయన.. కేంద్రం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తుందన్న షాకింగ్ వ్యాఖ్యను చేయటం ఆసక్తికరంగా మారింది.

మోడీ సర్కారు మీద వైసీపీ అధినేత మొదలు ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా ఘాటు విమర్శలు చేయరన్న పేరుంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదని.. అవసరమైతే.. కేంద్రంపైనా పదునైన వ్యాఖ్యలు చేసేందుకు తాము వెనుకాడమన్న విషయాన్ని అర్థమయ్యేలా విజయ సాయి తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. త్వరలోనే పార్టీ రెబల్ ఎంపీ రఘురామ రాజు బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. విజయసాయి తాజా విమర్శల్లో ఆ అంశం కూడా పరోక్షంగా ప్రస్తావన రావటం చూస్తే.. మోడీ సర్కారు మీద విరుచుకుపడటానికి కారణం రఘురామ రాజేనా? అన్న సందేహం కలుగుతోంది.

తాజాగా ఢిల్లీలో జరిగిన కేంద్ర అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున ఎంపీ విజయసాయి.. మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాలి. ఈ సందర్భంగా కేంద్రం తీరును తన మాటలతో తూర్పార పట్టేశారు.

విజయసాయి చేసిన తాజా వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ఎనిమిదేళ్లైనా కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదు. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోంది. బీజేపీ పక్షపాత ధోరణి అవలంభిస్తోంది.
- ప్రభుత్వ రంగ సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రాన్ని కోరాం. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది
- ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరాం. దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరాం. ఇప్పటివరకు స్పందన లేదు.
- పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్రం వైఖరి సరిగా లేదు. అనర్హత పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలను లేవనెత్తుతాం.
- పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌పై కేంద్రం ఉద్దేశపూర్వక కాలయాపన చేస్తోంది. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలి కోరాం కానీ ఎలాంటి స్పందన లేదు.
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాం. విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలి. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరినా ఫలితం లేదు.
- పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు?
- రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు కోరాం. బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం.
- తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6 వేలకోట్ల విద్యుత్‌ బకాయిలు రావాలి. విద్యుత్‌ బకాయిలను ఇప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి.