Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కార్ తీరు చట్ట వ్యతిరేకం .. జలశక్తి మంత్రికి విజయసాయి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   9 July 2021 12:49 PM GMT
కేసీఆర్ సర్కార్ తీరు చట్ట వ్యతిరేకం .. జలశక్తి మంత్రికి విజయసాయి ఫిర్యాదు
X
ఏపీ , తెలంగాణ మధ్య గత కొన్ని రోజుల జలవివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని వాడుకుంటుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే , కాదు తెలంగాణ ప్రభుత్వమే అక్రమంగా కట్టడాలు కట్టి ఎక్కువ నీటిని వాడుకుంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. దీనిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేశారు.

టీఆర్ ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చులో సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని, అలాగే కేఆర్ ఎం బీ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కేఆర్ ఎం బీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరినట్లు విజయసాయి చెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఓ వైపు ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తోంది. కేంద్రానికి లేఖల మీద లేఖాస్త్రాలు రాస్తోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో నేరుగా వెళ్లి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీకి చెందిన ప్రతినిధుల బృందం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణం ఆపించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, ప్రాజెక్ట్‌ల దగ్గర సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లపై అభ్యంతరం చెబుతూ లేఖను కూడా అందించారు విజయసాయిరెడ్డి. 8 ప్రాజెక్ట్‌ల ద్వారా 183 TMCలను తరలించేలా పనులు చేపడుతోందని, మరో 10 ప్రాజెక్ట్‌లను విభజన చట్టానికి విరుద్ధంగా కడుతోందని అభ్యంతరం చెబుతోంది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెంటనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.