Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'విజయనగరం'లో విజయమెవరిది?

By:  Tupaki Desk   |   1 April 2019 4:20 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: విజయనగరంలో విజయమెవరిది?
X
పార్లమెంట్ నియోజకవర్గం: విజయనగరం

టీడీపీ : అశోక్ గజపతి రాజు
వైసీపీ: బెల్లాన చంద్రశేఖర్
జనసేన : ముక్కా శ్రీనివాసరావు

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన లోక్‌ సభ నియోజకవర్గాల్లో విజయనగరం ఒకటి. సాంస్కృతిక - సాహిత్యానికి వేదికగా నిలిచిన విజయనగరం జిల్లా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. పూసపాటి రాజవంశీయులు పాలించిన ఈ జిల్లా పూర్వం కళింగ రాజ్యంలో ఉండేది. చింతపల్లి వద్ద సాగరతీరం ఆకట్టుకుంటుంది. అలాగే రాజకీయంగా చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌గజపతిరాజు - వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్‌ - జనసేన నుంచి ముక్కా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మాత్రం టీడీపీ - వైసీపీ మధ్యే పోరు సాగుతోంది.

*విజయనగరం పార్లమెంట్ చరిత్ర:

అసెంబ్లీ నియోజకవర్గాలు: బొబ్బిలి - రాజం - ఎచ్చెర్ల - చీపురుపల్లి - గజపతినగరం - నెల్లిమర్ల - విజయనగరం
ఓటర్లు: 14 లక్షల 4 వేలు

* అశోక్‌ గజపతిరాజుకు మరో విజయం దక్కేనా..?

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై అశోక్‌గజపతిరాజు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి నుంచి గజపతిరాజు అభివృద్ధి విషయంలో ముందున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా ప్లెక్లీలు ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలపై ఖర్చుల వివరాలు నమోదు చేసి ఏమైనా తేడా ఉండే ఫిర్యాదు చేయమని మరీ సెల్‌నెంబర్‌ అందులో ఇచ్చాడు.. దీంతో ఆయన పారదర్శకానికి నిదర్శంగా చెప్పవచ్చు. బీజేపీతో టీడీపీ పొత్తులో భాగంగా గజపతికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి వరించింది. అయితే లోక్‌సభలో నిర్వహించిన ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. హాజరు శాతం మాత్రం వంద శాతం ఉంది. విజయనగరం సమీపంలోని ద్వారాపూడి నగరాన్ని దత్తత తీసుకున్నారు. తాగునీరు, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఆయన కేంద్రమంత్రి అయ్యాక ప్రజలకు అందుబాటులో లేరని, ఆయన పేరు చెప్పుకొని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానికుడైనా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఈయనకు మైనస్ గా మారింది.

* అనుకూలతలు:

-కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
-పార్టీ బలంగా ఉండడం

* ప్రతికూలతలు:

-కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపణ
-టీడీపీలోని గ్రూపులను పట్టించుకోకపోవడం

* బెల్లాన చంద్రశేఖర్‌ వైసీపీ జెండా ఎగురవేస్తారా..?

గతంలో జడ్పీ చైర్మన్‌ గా పనిచేసి - పార్టీ సమన్వయకర్తగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌ కు చివరి నిమిషంలో వైసీపీ టికెట్‌ కట్టబెట్టింది. ఎన్నికల్లో కొత్తగా పోటీ చేస్తున్నా యువనాయకుడు కావడంతో యువకుల ఫాలోయింగ్‌ ఎక్కువగానే ఉంది. అయితే అశోక్‌ గజపతిరాజు లాంటి సీనియర్‌ నాయకుడిని ఎదుర్కొంటున్నాడంటే చంద్రశేఖర్‌కు ఉన్న ఫాలోయింగ్, బ్యాక్‌ సపోర్టును నమ్మే జగన్ టికెట్ ఇచ్చారు. మరోవైపు జగన్‌ చేసిన పాదయాత్ర.. మార్పు కోరుకుంటున్న ప్రజలు, టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతే తన గెలుపు సులభమే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
.
*అనుకూలతలు:

-యువత ఫాలోయింగ్‌
-జగన్‌ ఇమేజ్‌

*ప్రతికూలతలు:

-ప్రత్యర్థి సీనియర్‌ నేత కావడం
-టీడీపీ కేడర్‌ బలంగా ఉండడం

*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?

అభివృద్ధి పనులు చేయడంతో పాటు టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న అశోక్‌గజపతిరాజుపై వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి చంద్రశేఖర్‌ పోటికి దిగడం సంచలనంగా మారింది. ఆరుసార్లు ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం గజపతిరాజుకు ఉంది. అయినా యువతలో ఫాలోయింగ్‌ ఆధారంగా జడ్పీ చైర్మన్‌ గా చేసిన అనుభవంతో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ దూకుడుగా ముందుకెళుతున్నారు. వైసీపీ గాలి - ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్నాడు. ఈ ఎన్నికల్లో గట్టెక్కుతానని అంటున్నాడు. మరి విజయనగరం ప్రజలు సీనియర్‌ నేతకు పట్టం కడుతారా..? లేక యువనేతను ఆదరిస్తారా..? అనేది చూడాలి.