Begin typing your search above and press return to search.

పుట్టిన రోజున విజయమ్మ అక్కడ...వైసీపీ సంగతేంటి...?

By:  Tupaki Desk   |   19 April 2022 9:38 AM GMT
పుట్టిన రోజున విజయమ్మ అక్కడ...వైసీపీ సంగతేంటి...?
X
వైఎస్సార్ సతీమణిగా విజయమ్మకు తెలుగు రాష్ట్రాలలో గౌరవ మర్యాదలు చాలా ఉన్నాయి. ఇక ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా, ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఒక దశలో విజయమ్మే అంతా అన్నట్లుగా వైసీపీ కార్యకలాపాలు సాగాయి. ఇక ఏపీలో జగన్ సీఎం అయ్యారు. మూడేళ్ళుగా ఆయన పాలన సాగుతోంది. ఈ నేపధ్యంలో సోదరి వైఎస్ షర్మిల తెలంగాణాలో పార్టీని పెట్టి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు.

ఇక విజయమ్మ సైతం కుమార్తె షర్మిలతోనే ఉంటున్నారు. వైఎస్సార్టీపీలోనే ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ మధ్య వైఎస్సార్ వర్ధంతిని హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ, షర్మిల నాయకత్వంలోనే జరిపించారు. ఒక విధంగా ఏపీలో విజయమ్మ పెద్దగా కనిపించడంలేదు. ఆమె రాజకీయంగా కూడా ఏమీ మాట్లాడడంలేదు.

ఈ నేపధ్యంలో విజయమ్మ పుట్టిన రోజు వచ్చింది. ఆమె తన కుమార్తె షర్మిల పాదయాత్ర చేస్తున్న కొత్తగూడెం జిల్లా భద్రాద్రి లక్ష్మీదేవిపల్లిలోనే పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అక్కడ ప్రజల మధ్యనే ఆమె ఆనందంగా గడిపారు. షర్మిల తల్లితో కేక్ కట్ చేయించారు. ఆమెకు ముద్దాడారు. హ్యాపీ బర్త్ డే మామ్ అని చెబుతూ ఆమెతో తానున్న ఫోటోలను ట్విట్టర్ లో పెట్టారు. మొత్తానికి చూస్తే పుట్టిన రోజున కుమార్తె వద్దకే విజయమ్మ వెళ్ళడం మాత్రం కొంత ఆలోచించే విషయంగానే ఉంది అంటున్నారు.

గతంలో విజయమ్మ పుట్టిన రోజున అటు కుమారుడు జగన్ కూడా పాలుపంచుకునేవారు. ఇపుడు జగన్ ఏపీలో ఉంటున్నారు. సీఎం గా బిజీగా ఉన్నారు. అయినా కూడా తల్లి తాడేపల్లి రావచ్చు, బర్త్ డే వేడుకలు జరుపుకోవచ్చు. కానీ ఎందుకో ఆమె కొత్తగూడెం నే ఎంచుకున్నారు. అంటే రాజకీయంగా షర్మిల వైపే విజయమ్మ ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.

నిజానికి చూస్తే విజయమ్మ వైసీపీకి చాలా ఏళ్ళుగా గౌరవ అధ్యక్షురాలిగా ఈ రోజుకీ ఉన్నారు. తనకు ఆ పదవి వద్దు అని ఆమె చెప్పినట్లుగా ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ప్లీనరీ వరకూ తల్లిని కొనసాగమని జగన్ చెప్పారని, ఆ తరువాత కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే టైమ్ లో విజయమ్మ కోరిక మేరకు ఆ పదవి నుంచి ఆమెను తప్పిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా విజయమ్మ బర్త్ డేను ఒకనాడు వైసీపీ శ్రేణులు కూడా సంబరంగా జరుపుకునేవారు.

ఇపుడు ఆమె వైఎస్సార్టీపీకే తమ మద్దతు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా తన చర్యలతో రుజువు చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆమె వైఎస్సార్ లో సగం. జగన్ కి తల్లి. కాబట్టి ఆమె కనుక వైసీపీ వైపు తొంగి చూడకపోతే ఆ ప్రభావం ఎంతో కొంత ఈ వైపున పడుతుంది అన్నది ఒక విశ్లేషణ. చూడాలి మరి. ఏం జరుగుతుందో.