Begin typing your search above and press return to search.

ఎంపీ అవినాష్ రెడ్డి మాతృమూర్తికి విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శ‌!

By:  Tupaki Desk   |   22 May 2023 8:20 PM GMT
ఎంపీ అవినాష్ రెడ్డి మాతృమూర్తికి విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శ‌!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ, సీఎం జ‌గ‌న్ సోద‌రుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ ల‌క్ష్మ‌మ్మ‌.. క‌ర్నూలులోని విశ్వ‌భార‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. గ‌త శుక్ర‌వారం అవినాష్‌రెడ్డిని సీబీఐ విచార‌ణ‌కు పిలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న పులివెందుల నుంచి బ‌య‌లు దేరారు. అయితే.. మార్గ‌మ‌ధ్యంలో ఉండ‌గానే.. త‌న త‌ల్లి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారంటూ.. మెసేజ్ రావ‌డంతో ఆయ‌న హైద‌రాబాద్‌కు రాకుండా వెనుదిరిగి పులివెందుల‌కువెళ్లారు.

ఈ క్ర‌మంలో అస్వ‌స్థ‌త‌కు గురైన త‌ల్లిని తొలుత క‌డ‌ప‌లోని సీఎం జ‌గ‌న్ మామ‌గారు గంగిరెడ్డి ఆసుప‌త్రిలో తొలుత చేర్పించారు. అనంత‌రం.. మెరుగైన వైద్యం కోసం.. క‌ర్నూలుకు త‌ర‌లించారు. గ‌త రెండు రోజులుగా ఎంపీ మాతృమూర్తి ల‌క్ష్మమ్మ‌.. విశ్వ‌భార‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

తాజాగా సోమవారం ఆసుప‌త్రి వ‌ర్గాలు ఆమె హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేశారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మెరుగు ప‌డ‌లేద‌ని, ర‌క్త పోటు(బీపీ) నియంత్ర‌ణ‌లోకి రాలేద‌ని.. ఒక‌సారి గుండెపోటు కూడా వ‌చ్చింద‌ని తెలిపా రు. మ‌రికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే ఉంచి వైద్య అందించాల్సి ఉంద‌ని తెలిపారు.

ఇదిలావుంటే, సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ‌.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే హుటాహుటిన‌.. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూలుకు వ‌చ్చి.. ఆసుప‌త్రిలో ఉన్న ల‌క్ష్మ‌మ్మ‌ను ప‌రామ‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఐసీయూలో ఉన్న కార‌ణంగా ఆమెను అనుమ‌తించ‌లేద‌ని తెలిసింది. దీంతో కొద్ది సేపు వ‌రుస‌కు కుమారుడు అయ్యే ఎంపీ అవినాష్ రెడ్డితోనే ఆమె మాట్లాడి ల‌క్ష్మ‌మ్మ ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు. సుమారు గంట సేపు ఆసుప‌త్రిలోనే విజ‌య‌మ్మ గ‌డిచిన‌ట్టు స‌మాచారం. కాగా, ల‌క్ష్మ‌మ్మ‌.. వ‌రుస‌కు.. విజ‌య‌మ్మ‌కు చెల్లెలు అవుతారు. వైఎస్ భాస్క‌ర‌రెడ్డి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిలు అన్న‌ద‌మ్ములు కావ‌డంతో వీరికి ద‌గ్గ‌రి బంధుత్వం ఉండ‌డం గ‌మ‌నార్హం.