Begin typing your search above and press return to search.

కెప్టెన్ నాలుక బిగుంచుడేంది?

By:  Tupaki Desk   |   21 April 2016 4:22 AM GMT
కెప్టెన్ నాలుక బిగుంచుడేంది?
X
తమిళ రాజకీయాలు కాస్త చిత్రంగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలకు పూర్తి భిన్నంగా ఉండే ఈ రాష్ట్ర రాజకీయాలకు తగ్గట్లే రాజకీయ పార్టీ అధినేతల తీరు కూడా విభిన్నంగానే ఉంటుంది. అహభావానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఒక జయలలిత కావొచ్చు.. దూకుడుకు.. దురుసుతనానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే విజయకాంత్.. తమిళ అతివాది వైగో.. నాస్తిక సంఘానికి ప్రపంచ అధ్యక్షుడిలా వ్యవహరించే కరుణానిధి.. ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ రాజకీయ పార్టీ అధినేతలంతా కాస్త డిఫరెంట్.

సైద్దాంతికంగా.. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా నలుగురి మధ్యకు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం.. ఆచితూచి వ్యవహరిస్తూ.. హుందాగా ఉండటం మామూలే. అయితే.. ఇలాంటి వాటికి దూరంగా ఉండే వ్యక్తి డీఎండీకే అధినేత.. కెప్టెన్ గా సుపరిచితుడైన విజయకాంత్. ఆయనకు ఎప్పుడు ఆగ్రహం వస్తుందో తెలీదు. ఒకవేళ కానీ వస్తే.. చిన్నపిల్లాడు కనుక ఎలాంటి పిల్ల చేష్టలు చేస్తాడో అలాంటివే చేస్తారు. తాను నలుగురి మధ్యన ఉన్నా అన్న స్పృహను కూడా కోల్పోతాడు.

తాజాగా సేలంలో ఒక కార్యక్రమాన్ని కెప్టెన్ నిర్వహించారు. పార్టీ కార్యదర్శులు.. పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మీడియాకు ఎంట్రీ లేదు. అలా అని మీడియా దూరంగా ఉండలేదు కాబట్టి.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్యాణ మండపానికి కాస్త దగ్గర్లో మీడియా వెయిట్ చేస్తోంది. కార్యక్రమానికి హాజరు కావటానికి విజయ్ కాంత్ రావటంతో.. ఆయన బైట్ తీసుకుందామని మీడియా ప్రతినిధులు ఆశ పడ్డారు. వారి ఆశను చూసిన కెప్టెన్ కు ఒళ్లు మండిపోయింది. తను పిలిచినప్పుడు రావాలే కానీ.. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రావటం ఏమిటని ఫీలయ్యారో ఏమో కానీ.. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది.

ఇదిలా ఉన్నప్పుడే ఒక మీడియా ఛానల్ ప్రతినిధి తన బారు మైకును విజయకాంత్ ముందు పెట్టారు. అంతే.. ఆయన కోపం నశాళానికి అంటింది. ఆ మైకును తోసిపారేయటమే కాదు..నాలుక బిగించి మీడియా మీద తిట్ల దండకం అందుకున్నంత పని చేశాడు. తన ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నంలో తన పక్కనున్న ప్రైవేటుసిబ్బంది మీద పంచ్ ల మీద పంచ్ లు వేశాడు. కెప్టెన్ మాట రికార్డు చేసుకునే అవకాశం దక్కనప్పటికీ.. అవసరం లేని పిచ్చ కోపాన్ని ఎంచక్కా రికార్డు చేసుకున్న మీడియా విజయకాంత్ ఆ విజువల్స్ ను ఓ రేంజ్ లో టెలికాస్ట్ చేయటం మొదలెట్టింది. అవసరం లేని సమయంలో అనవసర ఆగ్రహాన్ని ప్రదర్శించిన కెప్టెన్ తీరుపై సోషల్ మీడియాలోనూ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోకులు ఓరేంజ్ లో పేలుతున్నాయి. వీటి గురించి తెలిస్తే.. కెప్టెన్ కోపం మరే స్థాయికి వెళుతుందో..?