Begin typing your search above and press return to search.

కెప్టెన్ కు ఓటమికి మించిన మరో షాక్ రెఢీ

By:  Tupaki Desk   |   20 May 2016 3:32 PM GMT
కెప్టెన్ కు ఓటమికి మించిన మరో షాక్ రెఢీ
X
నోరు మంచిగా ఉంటే ఊరు సైతం మంచిగా ఉంటుందని ఊరికే చెప్పలేదు. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోలేని డీఎండీకే అధినేత.. కెప్టెన్ గా సుపరిచితుడైన నాటి సినీహీరో విజయ్ కాంత్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితిలో పడ్డారని చెప్పాలి. రాజకీయాల్లో ఏ దుర్గుణాలు అయితే ఉండకూడదో అలాంటివన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ కొందరు అధినేతలు కేవలం తమ మాటతో బండి లాగించేస్తుంటారు. ఎవరి దాకానో ఎందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సంగతే తీసుకోండి.. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. కానీ.. ఆమ నోటి మాట మాత్రం ఆచితూచి అన్నట్లుగా ఉంటుంది.

నిజానికి ఆమె నోరు విప్పినట్లుగానే కనిపించరు. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా స్పీచ్ లు ఇచ్చే అధినేతలకు భిన్నంగా జయ ఉంటారు. మాట్లాడకుండానే బండి నడిపించే ఆమె.. మాట్లాడే నాలుగు మాటలైనా సరే ఆచితూచి మాట్లాడతారే తప్పించి నోరు జారరు. కానీ.. విజయ్ కాంత్ తీరు అందుకు పూర్తి భిన్నం. ఇష్టారాజ్యంగా నోటికి పని చెప్పటం ఒక ఎత్తు అయితే.. జయలలితకు ఉన్నట్లే అహంకారం పాళ్లు ఎక్కువే. ఇవి చాలవన్నట్లుగా ఆవేశం ఒకటి. ఇలా ఏమైతే ఉండకూడదో అలాంటి గుణాలన్నీ ఉన్న కెప్టెన్.. తన చేతులారా ఓటమిని కొని తెచ్చుకున్నారని చెప్పాలి.

జయలలిత.. కరుణానిధి మాదిరి తనకు బలం లేదన్న వాస్తవాన్ని నమ్మని ఆయన.. తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటారని చెప్పాలి. ఈ అనవసరపు ఆత్మవిశ్వాసమే ఆయన్ను కరుణతో చేతులు కలపకుండా చేసింది. ఇక.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయన తీరుతో జడుసుకున్న జనాలు.. చివరకు ఆయన్ను కూడా గెలిపించకుండా తగిన శాస్తి చేశారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి తానేనంటూ తెగ ప్రచారం చేసుకున్న ఆయన.. చివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని దుస్థితి. ఆయన పార్టీకి చెందిన ఒక్కరు కూడా తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోవటం తెలిసిందే.

ఈ ఓటమి షాక్ నుంచి తేరుకోని ఆయనకు మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఆయన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించాలంటే కనీసం ఆరు శాతం ఓట్లు ఆయన పార్టీకి పడాలి. కానీ.. ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీకి 2.4 శాతం ఓట్లు నమోదైన పరిస్థితి. దీంతో.. ఆయన పార్టీ గుర్తింపును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. కరుణతో కానీ పొత్తు పెట్టుకొని ఉంటే.. పార్టీ విజయం సాధించటమే కాదు.. తమిళ రాజకీయాల్లో చక్రం తిపపే వారన్న అభిప్రాయం. చెడిపోయేవాడిని ఎవరూ బాగు చేయలేరని ఊరికే అనలేదేమో..?