Begin typing your search above and press return to search.

మంచికి పోయి దెబ్బ‌లు తిన్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   15 Nov 2015 8:33 AM GMT


త‌మిళ‌నాడు డీఎండీకే అధినేత విజ‌య‌కాంత్ వైఖ‌రి మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. పార్టీ ఎమ్మెల్యే ప‌ట్ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. త‌ప్పు చేయ‌కున్నా.. ఈ కొట్టుడేంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ అధినేత‌కు కోపం వ‌స్తే ప‌రిస్థితి ఎంత వ‌య‌లెంట్ గా ఉంటుందో చూసినోళ్లు ఆశ్చ‌ర్యపోతున్న ప‌రిస్థితి. పార్టీ ఎమ్మెల్యేని కొట్టేంత త‌ప్పు స‌ద‌రు నేత ఏం చేశారు? విజ‌య‌కాంత్ కు ఎందుకంత కోపం వ‌చ్చింది? లాంటి కార‌ణాలు చూస్తే సిల్లీగా అనిపించ‌క‌మాన‌దు.

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా త‌మిళ‌నాడు అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య్ కాంత్ బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు వివిధ ప్రాంతాల‌కు వెళుతున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న క‌డ‌లూరుకు వెళ్లారు. అక్క‌డ సమావేశ‌మైన ఆయ‌న ప్ర‌సంగించే స‌మ‌యంలో స్థానిక నేత‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా వారి పేర్ల‌ను త‌ప్పుగా ప‌ల‌క‌టంతో.. ఎందుకైనా మంచిద‌న్న ఉద్దేశ్యంతో పార్టీ ఎమ్మెల్యే శివ‌కుళందై అధినేత చేస్తున్న త‌ప్పును స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. పేర్ల‌ను త‌ప్పుగా ప‌లుకుతుంటే.. వాటిని స‌రిచేస్తూ విజ‌య‌కాంత్ కు చెప్పారు.

తాను మాట్లాడుతుంటే మ‌ధ్య‌లో క‌దిలించుకోవ‌టం.. తాను చెబుతున్న పేర్ల‌లో త‌ప్పుల్ని ఎత్తి చూప‌టంలా ఫీల‌య్యారో ఏమో కానీ.. ఆయ‌న‌కు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతే.. ఎమ్మెల్యే అని చూడ‌కుండా.. వీపు మీదా.. త‌ల మీద కొట్ట‌టం అంద‌రిని విస్మ‌యానికి గురి చేసింది. అధినేత ప‌రువు పోకుండా ప్ర‌య‌త్నించిన ఎమ్మెల్యే ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అని మండిప‌డుతున్నారు. గ‌తంలోనూ పార్టీ నేత‌ల మీద చేయి చేసుకున్నారంటూ విజయ్ కాంత్ మీద విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈసారి.. బ‌హిరంగంగానే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టం పార్టీకి న‌ష్టం వాటిల్ల‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.