Begin typing your search above and press return to search.

దొరగారంటూ.. గ్రేటర్ ‘పంచ్’ విసిరిన రాములమ్మ

By:  Tupaki Desk   |   17 Nov 2020 1:10 PM GMT
దొరగారంటూ.. గ్రేటర్ ‘పంచ్’ విసిరిన రాములమ్మ
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రెస్ అయిన కాసేపటికే పంచ్ లాంటి పోస్టును పెట్టారు విజయశాంతి అలియాస్ రాములమ్మ. గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. అవన్నీ అవాస్తవాలుగా ఆమె అభివర్ణించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిన తర్వాత కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారని చురకలు వేశారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరి.. అసదుద్దీన్ అద్భుత దీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరవార ఆశలు పెంచుకున్నారన్నారు.

ఫేస్ బుక్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన ఆమె.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపైనా విమర్శలు సంధించారు. ఆయన చేసిన విమర్శలు.. ఆరోపణల్లో ముఖ్యమైనవి చూస్తే..

- చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా... విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారు.

- ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది.

- గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు.

- ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది.

- జీహెచ్ఎంసి మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు..." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం.