Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ బండారం బయటపడింది: విజయసాయి

By:  Tupaki Desk   |   10 May 2019 10:06 AM IST
రవిప్రకాష్ బండారం బయటపడింది: విజయసాయి
X
టీవీ9 సీఈవో రవిప్రకాష్ పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. రవిప్రకాష్ దశాబ్ధ కాలంగా చేసిన అక్రమాల జాబితా చెబితే పెద్ద గ్రంథమే అవుతుందని విమర్శలు గుప్పించారు. మెరుగైన సమాజం కోసం అంటూ చీకటి రాజ్యాన్ని రవిప్రకాష్ నడిపాడని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో, మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి సంచలన విమర్శలు చేశారు.

చంద్రబాబు అధికారంలో కొనసాగేందుకు నటుడు శివాజీ తెరముందు , రవిప్రకాష్ తెరవెనుక తమ పాత్రలను శక్తివంచన లేకుండా పోషించారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ వైసీపీపైనా.. వైఎస్ జగన్ పైనా టీవీ9 ద్వారా విషం కక్కారని.. గరుడ పురణాలు చేస్తూ వచ్చారని ఆరోపించారు. వారి పాపం బద్దలై వారి రహస్య బంధం బట్టబయలైందన్నారు.

టీవీ9లోని తన వాటాల్లో కొన్ని శివాజీకి అమ్మి ప్లాన్ ప్రకారం షేర్లు కొత్త యాజమాన్యానికి బదలాయించకుండా రవిప్రకాష్ మోసం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీ ఎల్ టీ)ని ఆశ్రయించి మరోపెద్ద నాటకానికి తెరతీశాడని విమర్శించారు. వీరిద్దరూ తెల్లకాగితాలపై రాసుకొని ఏడాది తర్వాత బదిలీ విషయం చూసుకుందామనడం పెద్ద కుట్ర అని విమర్శించారు.

టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లకూడదనే రవిప్రకాష్ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రంగంలోకి దించాడని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. రాజకీయంగా తమకు తీరని నష్టమనే చంద్రబాబు ఈ మేరకు పావులు కదిపాడని ఆరోపించారు. రవిప్రకాష్ మెరుగైన సమాజం కోసం అంటూ ఆదర్శాలు తుంగలో తొక్కి అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. బలవంతపు వసూళ్లకు నడుం కట్టినప్పుడు సమాజం సిగ్గుతో తలవంచుకుందని ఆరోపించారు. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడని విమర్శించారు. వందల కోట్లను దక్షిణాఫ్రికాలో పెట్టుబడులు పెట్టారని.. చంద్రబాబు అండతో ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడని తెలిపారు.

రవిప్రకాష్ బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు లాగాడని.. బాధితుల సంఖ్య వేలల్లోనే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చివరకు టీవీ9 పెట్టుబడి దారు అయిన శ్రీనిరాజు తోడల్లుడు సత్యం రామలింగరాజుకు బెయిల్ రావడానికి ముందు నిమ్స్ హాస్పిటల్ లో చేరితే ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా.. స్పై కెమెరాతో చిత్రీకరించి కోట్లు వసూలు చేశాడని చెబుతుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు. లక్షల కోట్ల ఎర్రచందనం తరలింపులో రవిప్రకాష్ హస్తం ఉందని ఆరోపించారు. సినిమాల్లో అవకాశాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలన్నారు. తెలుగు మీడియా వీళ్ల బారి నుంచి బయటపడి 1980 నాటి విశ్వసనీయతను తెచ్చుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.