Begin typing your search above and press return to search.

విజయసాయి.. సీఎంలకే సవాలు విసురుతున్నారుగా?

By:  Tupaki Desk   |   12 Nov 2020 12:30 PM GMT
విజయసాయి.. సీఎంలకే సవాలు విసురుతున్నారుగా?
X
ఇవాల్టి రోజుల్లో పని చేయనోళ్లే చేసినట్లుగా బిల్డప్పులు ఇస్తున్న దుస్థితి. అలాంటిది.. పని చేసి చెప్పుకుంటే తప్పేముంది? నిజానికి.. దీన్ని తప్ప పట్టాల్సిన అవసరం కూడా లేదు. అదే సమయంలో.. దేశంలో మరేరాష్ట్రంలో అమలు చేయని రీతిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేయటం ఒక ఎత్తు అయితే.. వినూత్న పథకాలతో ప్రజలకు సాయం చేయటానికి మించింది ఏముంటుంది?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి తరచూ ఏదో ఒక పథకాన్ని తీసుకురావటం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి దన్ను లభించేలా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తరచూ కొత్త పథకాల్ని తెర మీదకుతెస్తున్నారు. అలా తీసుకొచ్చిన పథకమే ‘జలకళ’.

వ్యవసాయదారుడికి అసలుసిసలు సమస్య సాగునీరు. దీన్ని అధిగమించేందుకు కొందురు బోర్లు వేయటం.. అవి కాస్తా ఫెయిల్ కావటంతో ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి. అంతకంతకూ పెరిగే అప్పుతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉంది. ఇలాంటివి లేకుండా చేయటం కోసం.. రైతులకు అవసరమైన బోర్లను ప్రభుత్వమే వేయటం.. వారికి అవసరమైన మోటార్లను సైతం ప్రభుత్వమే అందించటం ద్వారా.. వారి మీద ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కారు.

అలా బోర్లు వేసి.. ఉచిత మోటార్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలన్నది జగన్ ప్రయత్నం. అందులో భాగంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో జలకళ పథకంలో బాగంగా రైతులకు మేలు సాగుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న రాజ్యసభ సభ్యులు.. పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి.. జలకళ లాంటి పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కారు.. రైతు ప్రభుత్వం అని చెప్పటానికి జలకళ పథకం ఒక్కటి చాలన్న మాటను ఆయన చెబుతున్నారు. ఈ తరహా పథకం దేశంలో మరే రాష్ట్రంలో అయినా అమలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పే సీఎంలు ఎవరైనా ఉన్నారంటారా?