Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరితో చంద్రబాబు కథ నడిపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   18 Feb 2018 5:42 AM GMT
ఆ ఇద్దరితో చంద్రబాబు కథ నడిపిస్తున్నారా?
X
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. మూడు స్థానాలకు జరగబోయే పోటీలో సంఖ్యాబలం ప్రకారం రెండు టీడీపీకి - ఒకటి వైసీపీకి రావాలి. కానీ.. పాలక టీడీపీ ఆ ఒక్కటి కూడా వైసీపీకి దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని... కేసులు మోపి వైసీపీ సభ్యులు ఆ రోజు ఓటింగులో పాల్గొనకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది... ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం కూడా చేస్తోందని.. ఇదంతా ఇద్దరు సీనియర్ అధికారుల కనుసన్నల్లో జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంటిలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు - ప్రిన్సిపల్ సెక్రటరీ సతీశ్ చంద్ర ద్వారా చంద్రబాబు మొత్తం కథ నడిపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి వారిపై ఫిర్యాదుచేసిన ఆయన తాజాగా మరోసారి వారిపై ఆరోపణలు గుప్పించారు.

రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపును అడ్డుకునేందుకు ఏబీ వెంకటేశ్వరరావు - సతీష్‌ చంద్రలు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు చంద్రబాబు - మంత్రులు - టీడీపీ నేతలే ఫిరాయింపులను ప్రోత్సహించారని… ఇప్పుడు కొందరు ఐఏఎస్‌ లు - ఐపీఎస్‌ లు కూడా ఆ పనిలోకి దిగారని విమర్శించారు.

చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ సమ్మిట్‌ ద్వారా ఏకంగా 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని - చైనా నుంచి 20 లక్షల కోట్లు - సింగపూర్‌ నుంచి 10 లక్షల కోట్లు - దావోస్ నుంచి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు ప్రచారం చేశారని… ఈస్థాయిలో పెట్టుబడులు వస్తుంటే ఇక సాయం చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో కేంద్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.