Begin typing your search above and press return to search.

క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ..నిప్పుబాబు వేల అబ‌ద్దాల్లో ఒక‌టి

By:  Tupaki Desk   |   28 Nov 2018 5:42 AM GMT
క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ..నిప్పుబాబు వేల అబ‌ద్దాల్లో ఒక‌టి
X
క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు విష‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ఎండ‌గ‌ట్టారు. కడప జిల్లా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు దారుణమైన వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో చంద్రబాబు దోబూచులాట ఆడుతున్నారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అన్నది చంద్రబాబు చెప్పే వేల అబద్ధాల్లో ఒకటన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేదని - అయితే దురదృష్టవశాత్తు ఆయన మృతితో ఆ ప్రాజెక్టు వెనుకబడిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు ఉక్కు ఫ్యాక్టరీపై ఇంతవరకు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ఈ ఉక్కు ఫ్యాక్ట‌రీ నిప్పుబాబు వేల అబ‌ద్దాల్లో ఒక‌ట‌ని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు.

ఒక్క హామీ కూడా పూర్తిచేయకుండా ప్రజలను మభ్యపెట్టడమే సీఎం ధ్యేయంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రొద్దుటూరులో ధర్మపోరాటం పేరుతో అధర్మపోరాటం చేశారన్నారు. ఈ సభకు తిరుమల తిరుపతి బస్సులను కూడా ఉపయోగించుకోవడం దారుణమన్నారు. అందులో మందు - మాంసం సైతం సరఫరా చేశారన్నారు. టీటీడీ ఆభరణాలు గల్లంతయ్యాయని గతంలో తాను చేసిన ఆరోపణలకు ప్రభుత్వం రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేసిందన్నారు. దానికి సంబంధించిన కోర్టు ఫీజులను టీటీడీతోనే కట్టించారని ఆరోపించారు. కలెక్టర్ - ఎస్పీలాంటి ఉన్నతస్థాయి అధికారులు సైతం అధికారపక్షానికి దాసోహం అయ్యారన్నారు. అలాంటి వారికి మా ప్రభుత్వం వచ్చాక తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఏపీ అవినీతిలో ప్రధమస్థానంలో ఉందని - వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని అవినీతి కేసుల్లో విచారణ జరుపుతామన్నారు. కడప జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు నెలకొన్నా ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయాన్ని అందించలేదన్నారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ చేస్తున్న దుష్ప్ర‌చారంపై విజ‌య సాయి రెడ్డి మండిప‌డ్డారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రంలో విపరీతమైన దోపిడీకి పాల్పడిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడు అన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లో తాము జతకట్టమన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడే బీజేపీతో కలుస్తాడన్నారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని అన్నారు. బీసీల కోసం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలోనే అసెంబ్లీలో ప్రయత్నించారన్నారు. పోలవరం ప్రాజెక్టులో కావాల్సిన మేర దోచుకోవచ్చునన్న ఉద్దేశ్యంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని దాదాపు రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. అక్కడ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేదని - కేవలం ఊరిజంలా రైతులకు ఆ ప్రాజెక్టును చూపిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర ఎంతో ఆదరణ పొందిందన్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా జరిగే ప్రచారం పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల అనంతరం ఈ అంశాలపై ప్రస్తుత డీజీపీ బాధ్యత వహించాల్సివస్తుందని హెచ్చరించారు.