Begin typing your search above and press return to search.

బాబును జైల్లో పెట్టే వ‌ర‌కూ నిద్ర‌పోను

By:  Tupaki Desk   |   30 April 2018 7:21 AM GMT
బాబును జైల్లో పెట్టే వ‌ర‌కూ నిద్ర‌పోను
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల్ని చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రూ.3ల‌క్ష‌ల కోట్లకు పైగా అవినీతికి పాల్ప‌డిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు. భారీగా అవినీతికి పాల్ప‌డి.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూల‌దోసిన బాబును జైల్లో పెట్టే వ‌ర‌కూ తాను నిద్ర‌పోన‌ని వ్యాఖ్యానించారు.

ఈ రోజు విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా చేసుకొని వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌ను చేపట్టిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేవారు. 2014 నుంచి టీడీపీ చేప‌ట్టిన స‌భ‌కు..ఈ ఏడాది ఏప్రిల్ 30న (ఈరోజు) చేప‌ట్టిన స‌భ ల‌క్ష్యాలు భిన్నంగా ఉన్నాయ‌న్నారు. తిరుప‌తిలో టీడీపీ చేప‌ట్టిన ధ‌ర్మ‌పోరాట దీక్ష కాద‌ని.. అధ‌ర్మ స‌భ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ప్ర‌త్యేక హోదాపై వంచ‌న‌తో చేస్తున్న స‌భ‌ను చిత్త‌శుద్దితో నిర్వ‌హిస్తున్నారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. కొండ‌పైన బీజేపీతో జ‌ట్టు క‌డుతూ.. కొండ కింద మాత్రం కుస్తీ ప‌డుతున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. మ‌హారాష్ట్రకు చెందిన బీజేపీ నేత కుటుంబ స‌భ్యుల‌కు టీటీడీ బోర్డు స‌భ్య‌త్వాన్ని క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు.. అదే బీజేపీ మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పు ప‌ట్టారు.

బాబు చేస్తున్న ప‌ని ధ‌ర్మ‌మా? న‌్యాయ‌మా? అని టీడీపీ నేత‌లు త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకోవాల‌న్నారు. బాబుపై తాను ఢిల్లీలో చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పిన విజ‌య‌సాయి.. తాను చేసిన ప్ర‌తి ఆరోప‌ణ‌కు ఆధారాలు ఉన్న‌ట్లు చెప్పారు. తాను ప్ర‌ధానిని క‌ల‌వ‌టంపై టీడీపీ నేత‌లు ర‌క‌ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోస‌మే తాను ప్ర‌ధానిని క‌లిశానే త‌ప్పించి.. మ‌రింకేమీ లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధానితో ప్ర‌స్తావించాన‌ని.. అవ‌స‌ర‌మైతే మ‌రో ప‌దిమార్లు ప్ర‌ధానిని క‌లుస్తాన‌ని చెప్పారు.

బాబు చేసిన అవినీతిపై ఆధారాల్ని తాను ప్ర‌ధాని మోడీకి స‌మ‌ర్పిస్తాన‌ని చెప్పిన విజ‌య‌సాయి.. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ గా బాబు నిలుస్తున్నార‌ని చెప్పారు. బాబును జైల్లో పెట్టించే వ‌ర‌కూ తాను నిద్ర‌పోన‌ని చెప్పిన ఆయ‌న,, గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లోనే మోడీ స‌ర్కారు నుంచి బాబు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తీవ్రంగా మండిప‌డ్డారు.