Begin typing your search above and press return to search.

కేసులా...డోంట్ కేర్ అంటున్న విజ‌య‌సాయి

By:  Tupaki Desk   |   20 Sep 2016 9:09 AM GMT
కేసులా...డోంట్ కేర్ అంటున్న విజ‌య‌సాయి
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా బదులుగా ప్ర‌త్యేక‌ ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డం - ఈ విష‌యంలో అధికార పార్టీలు ప్ర‌చారం చేసుకోవ‌డంపై ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ - కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విరుచుకుప‌డ్డాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి - కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి వేర్వేరు సంద‌ర్భాల్లో టీడీపీ తీరుపై మండిపడ్డారు. యువ‌భేరీ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ - ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీ విష‌యంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజి అంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీకి ఇచ్చారని, ఇందులో ప్రత్యేకం ఏమీ లేదని - అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విజయసాయి అన్నారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు - చంద్రబాబుతో బహిరంగచర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. కేసులకు భయపడేది లేదని - రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడబోమని విజయసాయి స్పష్టం చేశారు. వైసీపీ యువ‌భేరీతో ప్ర‌జ‌లు త‌మ హోదా ఆకాంక్ష‌ చాట‌నున్నార‌ని తెలిపారు.

ప్రజా బ్యాలెట్ స‌న్నాహ‌క స‌మావేశాల్లో భాగంగా పార్టీ శ్రేణుల‌తో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి టీడీపీ తీరును దునుమాడారు. తెలుగుదేశం పేరుతో ప్రస్తుతం మనుగడలోఉన్న పార్టీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని అన్నారు. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని ఆయన విమర్శించారు. కపట నాటకాలతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్నదంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని తుల‌సిరెడ్డి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ - 108వ సెక్షన్ అమలు వంటి కీలక అంశాలు పొందుపర్చారని, ఈ మూడు సూత్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయనందునే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామన్న కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో నిజంలేదని - ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడా సూచించలేదని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని అన్నారు. అయిన‌ప్ప‌టికీ తామేదో గొప్ప‌గా చేసేస్తున్న‌ట్లుగా సీఎం చంద్ర‌బాబు - కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు.