Begin typing your search above and press return to search.

బీజేపీలో బాబు బ్యాచ్ కు భలేగా పేరు పెట్టిన విజయసాయి

By:  Tupaki Desk   |   22 Nov 2019 10:45 AM GMT
బీజేపీలో బాబు బ్యాచ్ కు భలేగా పేరు పెట్టిన విజయసాయి
X
ఆధారాలు చూపించరు కానీ అభాండాలు వేసేస్తారు. మాట వరసకు కూడా మాట్లాడని వారు సైతం టచ్ లో ఉన్నారని చెప్పుకునే దరిద్రపుగొట్టు రోజులు రాజకీయాల్లో వచ్చేశాయి. చేతల్లో చూపించలేనోళ్లు.. మాటలతో హడావుడి చేయటం.. ఏదో జరిగిపోతుందన్న భావన కలిగేలా చేసే మైండ్ గేమ్ కు తెర తీయటం బాబు బ్యాచ్ కు అలవాటే. ఇంగువ కట్టిన గుడ్డకు వాసన పోదన్నట్లుగా బాబుతో జట్టు కట్టి ఏళ్లకు ఏళ్లు టీడీపీలో ఉన్న వారు బీజేపీలో చేరినంత మాత్రాన వారిలో మార్పు వస్తుందని ఆశించటం అత్యాశే.

ఈ విషయం తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకున్న సుజనా.. ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలటం తెలిసిందే. తాజాగా సుజనాకు భారీ కౌంటర్ ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

ట్విట్టర్ ను వేదికగా చేసుకొని ట్వీట్లతో సుజనాను కడిగిపారేసిన విజయసాయి.. ఆయనే చేసిన వ్యాఖ్యల్లో ఏ ఒక్కదానికి సుజనా బదులిచ్చినా గొప్పేనంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు టచ్ లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలపై విజయసాయి స్పందిస్తూ.. అవినీతి మీద చంద్రబాబు నాయుడు.. ఆకలి మీద లోకేశ్ నాయుడు.. ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు.. మహిళా రక్షణ మీద చింతమనేని.. సంస్కారం మీద ఉమా.. స్పీకర్ పదవి ఔనత్యం మీద యనమల లెక్చర్లు ఇస్తే ఎలా ఉంటుందో.. బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురించి ప్రెస్ మీట్లు పెడితే అలానే ఉంటుందని విజయసాయి నిప్పులు చెరిగారు.

ఇప్పటి మాదిరి కాకుండా ఈసారి సుజనా చౌదరి కాస్త భిన్నమైన ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని.. సదరు ప్రెస్ మీట్లో విలేకరులను కాకుండా తాను వేల కోట్లు మేర ముంచేసిన అరడజను బ్యాంకు అధికారుల్ని ఎదుట పెట్టి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగుంటుందన్నారు. బ్యాంకు అధికారులు అడిగే ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తే.. ఆయన పార్టీ ఎందుకు మర్నాడే ప్రజలకు అర్థమైపోతుందన్నారు.

మరో ట్వీట్ లో సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరుస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్ ను లైవ్ లో లైవ్ స్ట్రీమింగ్ లో మోతెక్కించిందంటే కారణం ఏమిటి? పబ్లిక్ ఇంట్రెస్టా? లేదంటే పబ్లిక్ గా తెలసిపోయిన ఇంట్రెస్టా? అని ప్రశ్నించారు. సుజనా నోట మాట రాని రీతిలో ప్రశ్నల వర్షం కురిపించిన విజయసాయి మాటలు సుజనాకు సూటిగా తగులుతాయనటంలో సందేహం లేదు.