Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్టు ఆ టీవీ న‌డుచుకుంటుందా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 2:59 AM GMT
విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్టు ఆ టీవీ న‌డుచుకుంటుందా?
X
గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా గెలిచారు.. ర‌ఘురామ‌కృష్ణంరాజు. అప్ప‌టి నుంచి ఆ పార్టీకి ఏకుకు మేకుగా మారారు. నిత్యం టీవీ చానెళ్ల‌కు, యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో, ఆరోప‌ణ‌ల‌తో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వాన్ని ఏకిప‌డేస్తున్నారు. మ‌రోవైపు అంతే ధీటుగా వైఎస్సార్సీపీ నేత‌లు కూడా ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై మండిప‌డుతున్నారు. ద‌మ్ముంటే రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసురుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ భిక్ష‌తో ర‌ఘురామ గెలిచార‌ని.. లేకుంటే ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని తేల్చిచెబుతున్నారు.

ఇక వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌యసాయిరెడ్డి, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మ‌ధ్య‌ నిత్యం ట్విట్ట‌ర్ లో వార్ జ‌రుగుతోంది. ఇద్ద‌రు నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లతో చెల‌రేగిపోతున్నారు. ఈ క్ర‌మంలో కొన్నిసార్లు వారి మ‌ధ్య భాష కూడా హ‌ద్దులు దాటుతోంద‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి. మ‌రోవైపు ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఇప్ప‌టికే వైఎస్సార్సీపీ లోక్ స‌భ స్పీక‌ర్ కు ప‌లుమార్లు ఫిర్యాదు చేసింది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినందుకు ర‌ఘురామ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరెస్టు చేయించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పోలీసులు త‌న‌పై దాడి చేశార‌ని ర‌ఘురామ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌నను క‌స్ట‌డీలోకి తీసుకుని చిత్రహింస‌లు పెట్టార‌ని, క‌నప‌డ‌కుండా కొట్టార‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని సంసద్‌ టీవీలో చర్చలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజును పిలవద్దని ఆ టీవీ సీఈవోకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ టీవీ సీఈవోకి లేఖ రాశారు. సంసద్‌ టీవీ చర్చల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ రఘురామ పాల్గొనడం తన దృష్టికి వచ్చిందని ఆ లేఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాలని ఇప్ప‌టికే తాము లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశామ‌ని విజ‌యసాయిరెడ్డి ఆ లేఖ‌లో తెలిపారు. ఆ పిటిషన్‌పై స్పీకర్‌ విచారిస్తున్నారని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రఘురామ‌కృష్ణ‌రాజు వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని, ఆయన మాటలు వైఎస్సార్‌సీపీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు పూర్తయ్యేవరకు ఆయన్ని సంసద్‌ టీవీ షోలు, చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి కోరారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్టు సంస‌ద్ టీవీ వింటుందా, లేదా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.