Begin typing your search above and press return to search.

ఈనాడు.. ఆంధ్రజ్యోతిలను పార్లమెంటులో బ్యాన్ చేయాలన్న విజయసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:08 AM IST
ఈనాడు.. ఆంధ్రజ్యోతిలను పార్లమెంటులో బ్యాన్ చేయాలన్న విజయసాయిరెడ్డి
X
సంచలన ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి. గురువారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈనాడు.. ఆంధ్రజ్యోతి దినపత్రికలను పార్లమెంటులో ఎంట్రీ విషయంలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయసాయి రెడ్డిని కేంద్రమంత్రి అమిత్ షా మందలించినట్లుగా తప్పుడు వార్తలు అచ్చేశారని.. ఇందుకు గాను.. ఆంధ్రజ్యోతి.. ఈనాడు దినపత్రికల మీద చర్యలు తీసుకోవాలన్నారు.

పార్లమెంటు ప్రివిలైజ్ కమిటీలో ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి.. తన పేరుప్రఖ్యాతుల్ని దెబ్బ తీసేలా నిరాధారమైన వార్తల్ని ప్రచురించారన్నారు. ఈనాడు.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లను పార్లమెంటులోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.

పాత్రికేయ విలువల్ని పక్కదారి పట్టిస్తూ..ఎలాంటి నైతికత లేకుండా తన మీద తప్పుడు ప్రచారం చేశారని విజయసాయి మండిపడ్డారు. తన పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీసేలా వార్తా కథనం ఉందని.. ఇలాంటి తీరు పార్లమెంటరీ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేలా చేస్తుందన్నారు. ఆ మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లను పార్లమెంటులో రిపోర్టింగ్ చేసేందుకు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.