Begin typing your search above and press return to search.

గీతం వర్సిటీ పై విజయసాయి షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 Oct 2020 10:45 AM IST
గీతం వర్సిటీ పై విజయసాయి షాకింగ్ వ్యాఖ్యలు
X
విశాఖతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. కేంద్రప్రభుత్వానికి.. యూజీసీకి ఆయన రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుందన్న విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతూ.. విశాఖలోని ఆ సంస్థ క్యాంపస్ లో కొన్ని భవనాల్ని కూల్చటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సదరు సంస్థ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. 2007లో డీమ్డ్ వర్సిటీ ప్రారంభించేందుకు గీతం యాజమాన్యం యూజీసీ అనుమతి తీసుకుందని.. అయితే.. 2008లో హైదరాబాద్.. 2012లో బెంగళూరు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

విశాఖ క్యాంపస్ కోసం ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ కబ్జా చేసినట్లుగా తమ వరకు వచ్చినట్లుగా విజయసాయి వెల్లడించారు. క్యాంపస్ కోసం నిబంధనలకు విరుద్ధంగా పరభుత్వ భూముల్ని సేకరించారని.. డాక్యుమెంట్లను బయట పెట్టటం లేదన్నారు. దూర విద్యతో పాటు.. పలు యూజీసీ నిబంధనల్ని గీతం డీమ్డ్ వర్సిటీ పాటించటం లేదన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తాను డిమాండ్ చేసినట్లుగా గీతం డీమ్డ్ వర్సిటీ హోదాను రద్దు చేస్తే.. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా ఆంధ్రా వర్సిటీ అఫ్లియేషన్ పొందేలా చూడాలన్నారు. రిషికొండ.. ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ అక్రమించినట్లుగా తమ విచారణలో తేలినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. వర్సిటీకి చెందిన ప్రహరీగోడ.. ప్రధాన గోడను కూల్చేశారు. ఈ వ్యవహారంపై గీతం వర్సిటీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతలపై స్టే మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే గీతం డీమ్డ్ వర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని విజయసాయి డిమాండ్ చేయటం.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.