Begin typing your search above and press return to search.

కేవీపీ దారిలోనే వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   3 Dec 2016 5:26 AM GMT
కేవీపీ దారిలోనే వైసీపీ ఎంపీ
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసే ప‌రిణామం పార్ల‌మెంటు వేదిక‌గా చోటుచేసుకుంది. ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం రాజ్య‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తరహాలోనే ఏపీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్‌ సీపీ నేత ఫిరాయింపుల నివారణకు ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టి కలకలం సృష్టించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అబాసుపాలవుతోందని ఫలితంగా ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పుకు విలువ లేకుండా పోయిందనే అభిప్రాయంతో ఉన్న విజయసాయిరెడ్డి ఫిరాయింపుల చట్టాన్ని 2016 బిల్లు పేరిట రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కు నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు పాలకపక్షంలోకి ఫిరాయించడాన్ని సవాళ్లుగా స్వీకరించిన ఆ పార్టీ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుంది. మరో వైపు పార్లమెంట్‌ లో ఈ చట్టానికి సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. గతంలో దేశ వ్యాప్తంగా పార్టీల ఫిరాయింపుల వ్యవహారం శృతిమించిన నేఫధ్యంలో భారత ప్రభుత్వం ఫిరాయింపులకు విరుగుడుగా చట్టం చేసిందని దీంతో కేంద్రం లక్ష్యం నేరవేరడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘటనలను ఉదాహరిస్తున్న విజయసాయిరెడ్డి ఆర్టికల్‌ 102 - ఆర్టికల్‌ 191లకు సవరణ చేయాలని లిఖితపూర్వకంగా కోరారు. ఈ చట్టాన్ని పార్లమెంట్‌ లో ఆమోదించినప్పుడు భారత ప్రభుత్వం సీరియస్‌ గా పరిగణించి మంచి ఉద్దేశ్యంతో ఫిరాయింపులను ప్రోత్సాహించకుడదంటూ పార్లమెంట్‌ వేదికగా సమాజానికి సంకేతాలను ఇచ్చిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తలవంపులు తెచ్చేదిగా ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/