Begin typing your search above and press return to search.

మా ఎమ్మెల్యేలను టీడీపీ కొనే ప్రయత్నం చేస్తోంది..

By:  Tupaki Desk   |   9 Feb 2018 12:41 PM GMT
మా ఎమ్మెల్యేలను టీడీపీ కొనే ప్రయత్నం చేస్తోంది..
X
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మల్యేలను చంద్రబాబు కొనే ప్రయత్నం చేస్తున్నారని... అది కుదరకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలను ముందుగా అరెస్టు చేసి వారు ఓటింగులో పాల్గొనకుండా అడ్డుకునే కుటిల ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా రాజ్యసభ ఎన్నికల పోలింగును ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముఖ్య అధికారి ఓపీ రావ‌త్ ను క‌లిసి టీడీపీపై ఫిర్యాదు చేశారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని, అందుకే పోలింగ్ కు ప‌ది రోజుల ముందు నుంచి వారికి సెంట్ర‌ల్ పోలీసుల‌తో సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కోరారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని.. ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాల సాయంతో భద్రత కల్పించాలని ఆయన కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సెంట్రల్ అబ్జర్వర్ ని పంపించి ఎన్నికలను పర్యవేక్షించాలని.. పోలింగ్ జ‌రిగే స‌మ‌యంలో బూత్ లో జ‌రిగే ప్ర‌క్రియ‌ను ఆన్ లైన్ ద్వారా సీఈసీ ప్రత్యక్షంగా వీక్షించేలా ఉండాల‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ఉన్న 44 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో మ‌రో న‌లుగురికి కొనేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని సీఈసీకి విజ‌య‌సాయిరెడ్డి వివ‌రించారు. కాగా సాయిరెడ్డి విజ్ఞ‌ప్తుల‌పై ముఖ్య ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందిస్తూ.. చట్టం ప్రకారం రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని... సెంట్రల్ అబ్జర్వర్ అలాగే రియల్ టైం సీఈసీ పర్యవేక్షణ కూడా చేస్తామని సీఈసీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సాయిరెడ్డి ఇద్దరు ఏపీ అధికారులపైనా ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకొనుగోలు విషయంలో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీశ్ చంద్ర, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం వ్యవహారాన్ని టీజీ వెంకటేశ్ చూస్తున్నారని... ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లిచ్చి కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.