Begin typing your search above and press return to search.

దేవాన్ష్ ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

By:  Tupaki Desk   |   8 Nov 2019 8:26 AM GMT
దేవాన్ష్ ను తెలుగు మీడియంలో చదివిస్తారా?
X
కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ.. వాస్తవకోణంలో చూసే వారికి ఇలాంటి నిర్ణయాలు మారిన కాలానికి తగ్గట్లు తప్పు లేదనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిషు మీడియంలో నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మండిపడుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఈ తీరుపై తమ అక్కసును వ్యక్తం చేస్తున్నాయి.

అయితే.. ఇలా విమర్శించే వారు.. అక్కసు వ్యక్తం చేసే వారందరి కుటుంబాల్లోని పిల్లలు చదివింది.. చదువుతున్నది ఇంగ్లిషు మీడియంలోనా? తెలుగు మీడియంలోనా? అన్న ప్రశ్న వేస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. అమ్మభాషలో కాకుండా ఇంగ్లిషులో చదువుకోవటం వల్ల తెలుగుకు దూరమవుతామన్న బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు మీడియంలో చదువుతున్నది కేవలం సర్కారీ స్కూళ్లల్లోని పిల్లలే తప్పించి ప్రైవేటు కాన్వెంట్లలో కాదన్నది మర్చిపోకూడదు.

సర్కారీ స్కూళ్లలో ఉన్నదంతా పేద.. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలే. చదివితే అందరు పిల్లలు తెలుగులో చదవాలి. కానీ.. డబ్బున్న పిల్లలు ఇంగ్లిషులో..పేద పిల్లలు తెలుగులో చదవటం వల్ల ఉపాధి అవకాశాల విషయంలోనూ వారెప్పుడూ తక్కువగానే ఉంటారన్నది మర్చిపోకూడదు. ఒకవేళ.. అమ్మభాష మీద అంత ప్రేమే ఉంటే.. ఏపీ వ్యాప్తంగా స్కూలు ఏదైనా తెలుగు మీడియం తప్పించి.. ఇంగ్లిషు మీడియం ఉండదని తేల్చి చెప్పగలరా? అన్న ప్రశ్నకు సమాదానం చెప్పరు.

తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న లోకేశ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నేత విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా సాక్షిగా ఆయన లోకేశ్ అండ్ కోపై విరుచుకుపడ్డారు. లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తారా? అంటూ సూటి ప్రశ్న వేశారు.

మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగకూడదు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదకూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీకొడుకులు అంటూ మండిపడ్డారు. నిజమే.. తెలుగు మీడియం అంటున్న విపక్షం.. వారి పిల్లల్ని మాత్రం ఇంగ్లిషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారన్న సూటి ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. టైమ్లీగా విసిరిన పంచ్ విపక్షానికి సూటిగా తగిలేలా ఉందన్న మాట వినిపిస్తోంది.