అమెరికాను షేక్ చేస్తున్న ఆ వీడియో!

Sat May 30 2020 07:00:02 GMT+0530 (IST)

video shows Minneapolis police arrest of George Floyd

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ నల్ల జాతీయులపై దశాబ్దాలుగా ఉన్న వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని చాటి చెప్పే ఘోరమిది. ఓ నల్ల జాతీయుడిని ఓ పోలీస్ అధికారి దారుణంగా హింసించి అతడి మరణానికి కారణమవడం పెను దుమారం రేపుతోంది. ఆ వ్యక్తిని హింసించిన వైనమంతా వీడియోలో రికార్డవడంతో అది చూసి నల్ల జాతీయులు తీవ్ర ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. కరోనా భయాన్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదికి వేలాదిగా తరలి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని పోలీసులు ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. అతను పట్టుబడిన సమయంలో కింద పడేసిన పోలీస్ అధికారి మెడపై మోకాలితో అదిమిపెట్టాడు. తనకు ఊపిరాడట్లేదని జార్జ్ అంటున్నా.. బాధతో విలవిలలాడుతున్నా ఆ అధికారి విడిచి పెట్టలేదు. ఐదు నిమిషాల పాట అలాగే మెడపై మోకాలు పెట్టి గట్టిగా నొక్కుతుండటంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారింది. అతను స్పృహ కోల్పోయాక ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. జార్జ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు.

స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ ఘటన అమెరికాలో తీవ్ర నిరసనలకు కారణమైంది. తొలుత మిన్నియాపోలిస్ నగరంలో కొంతమంది యువకులతోతో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జార్జ్‌ను కొట్టిచంపిన పోలీసులను విధులనుంచి తొలగించినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆరలేదు. ఈ ఘటనలో భాగమైన నలుగురు పోలీసులను ఉరి తీయాలంటూ నల్ల జాతీయులు ఆందోళన బాటపడ్డారు.  పలుచోట్ల లాఠీ ఛార్జీలు ప్రతిగా వాహనాల ధ్వంసం జరిగింది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మిన్నియాపోలిస్ గవర్నర్ ను ఆదేశించారు.