Begin typing your search above and press return to search.

అడుగడుగునా నిర్లక్ష్యం .. చివరి క్షణాల్లో కరోనా బాధితుడి ఆర్తనాదం .. వీడియో వైరల్ !

By:  Tupaki Desk   |   28 July 2020 4:00 PM GMT
అడుగడుగునా నిర్లక్ష్యం .. చివరి క్షణాల్లో కరోనా బాధితుడి ఆర్తనాదం .. వీడియో వైరల్ !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా కేసులు , కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ , మమ్మల్ని బ్రతికించుకోండి , ఇక్కడ నన్ను పట్టించుకోవడంలేదు , ఊపిరి ఆడటం లేదు ..కరోనా రోగుల నుండి ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా రోగులు చివరి క్షణంలో ఆసుపత్రుల్లో ఉండే సౌకర్యాలపై మండిపడుతూ వీడియోలు తీస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

తన గొంతు ఎండిపోతోందని.. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని తెలిపాడు. సౌకర్యాల కొరత కారణంగా తాను అనుభవిస్తున్న బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. అతడి చొక్కా కూడా రక్తంతో తడిచిపోయి కనిపిస్తుండటం గమనార్హం. అయితే , ఆ వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే అతడు కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం ఉత్తర ప్రదేశ్ ‌లోని ఝాన్సీ లో చోటుచేసుకుంది.

ఆస్పత్రిలో తాగునీటికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా గొంతు పొడిబారుతోంది. వెంటిలేటర్‌ వల్ల ఊపిరాడటం లేదు. నన్ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతా నిర్లక్ష్యం..’ అని కరోనా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో నిడివి 52 సెకన్లు ఉంది. ఝాన్సీ మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రిలోని కరోనా వార్డులో చేరిన కరోనా బాధితుడు సోమవారం దీన్ని చిత్రీకరించాడు. ఇది ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని ప్రధాన కరోనా హాస్పిటల్ లో ఈ హాస్పిటల్ కూడా ఒకటి. ఈ వీడియో వైరల్ అవ్వడం తో యోగి సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. గొప్పలు చెప్పుకోవడం మానేసి ..కరోనా బాధితులకి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అయితే, ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియా నుండి తొలగించేసారు.

ఈ ఘటన పై ఝాన్సీ ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ అధికారి జీకే నిగమ్‌ స్పందించారు. వీడియో చిత్రీకరించిన సమయానికి, అతడి మరణానికి మధ్య ఉన్న టైమ్ గ్యాప్ అంత స్పష్టంగా లేదని, బాధితుడి భార్య, కుమార్తె కూడా కరోనా బారిన పడ్డారని.. వారిద్దరూ మరో వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే , హాస్పిటల్ లో వసతులపై అయన ఏమి మాట్లాడలేదు.