Begin typing your search above and press return to search.

ఢిల్లీ లాయర్లు ఏమేం చేశారో చెప్పే వీడియో క్లిప్ బయటకు..

By:  Tupaki Desk   |   8 Nov 2019 9:56 AM GMT
ఢిల్లీ లాయర్లు ఏమేం చేశారో చెప్పే వీడియో క్లిప్ బయటకు..
X
కేవలం సినిమాల్లో మాత్రమే చూసే ఒక సీన్ రీసెంట్ గా ఢిల్లీలో రియల్ గా దర్శనమివ్వటం తెలిసిందే. పోలీసులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన వైనం సంచలనంగా మారింది. ఢిల్లీ లాయర్లు తమపై చేసిన దాడిని ఖండించిన పోలీసులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి.. గంటల పాటు దీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారం సంచలనంగా మారటమే కాదు.. క్రమ శిక్షణ కలిగిన పోలీసులు ఇలా చేయటం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన వీడియోను చూసినప్పుడు.. వారి ఆందోళనకు అర్థముందన్న భావన కలగటం ఖాయం.

తీస్ హజారీ కోర్టు ప్రాంగణం లో గత శనివారం పోలీసులకు.. లాయర్లకు మధ్య గొడవ జరగటం.. అదో పెద్ద అంశంగా మారటం తెలిసిందే. పార్కింగ్ విషయం లో తలెత్తిన గొడవ లో లాయర్లు పలువురు పోలీసుల మీద దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న గొడవలో 30 మంది పోలీసులకు.. పలువురు లాయర్లకు దెబ్బలు తగిలాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు కూడా

ఒక సమయంలో గల్లీ ఫైటింగ్ ను తలపించిన ఈ వైనం సంచలనం గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ తో పోలీసుల మీద లాయర్ల జులం ఎంతన్న విషయం కళ్లకు కట్టేలా మారింది.

సెకన్ల నిడివిలో ఉన్న ఈ క్లిప్ లో ఒక మహిళా డీసీపీని కొందరులాయర్ల గుంపు తరుముకుంటూ వస్తుండగా.. మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచి బయటకు తీసుకురావటం కనిపిస్తుంది. ఈ సమయంలో తమ సహాయక సిబ్బందిలో ఒకరి పిస్టోల్ ను ఎవరో కొట్టేసినట్లుగా డీసీపీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సిబ్బంది సాయంతో సదరు మహిళా డీసీపీ బయటపడగలిగారు.

మహిళా డీసీపీని లాయర్ల గుంపు నుంచి రక్షించిన పోలీసు అధికారి ఒకరి భుజానికి గాయమైందంటున్నారు. తాజాగా బయటకు వచ్చిన సీసీ కెమేరా ఫుటేజ్ లో లాయర్ల తీరు ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పుటేజ్ లోనే ఒక లాయర్ బైక్ కు నిప్పు పెట్టటం కూడా కనిపించింది. దీంతో అక్కడున్న పోలీసులు స్పందించి బైక్ మంటల్ని ఆర్పేశారని.. లేకుంటే అక్కడి పరిసరాల్లో లాకప్ లో ఉన్న 150 మంది ఖైదీల ప్రాణాలు ప్రమాదం లో పడేవని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే శనివారం జరిగిన ఉదంతం లో లాయర్ల దాష్టీకం కళ్లకు కట్టినట్లుగా తాజా పుటేజ్ తో తేలిందంటున్నారు. సోమవారం మరో సారి పోలీసుల పైకి లాయర్లు దాడికి దిగటంతో.. పోలీసులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో.. ఈ వ్యవహారం జాతీయ స్థాయి లో పెద్ద వార్తగా మారింది. తాజాగా బయటకు వచ్చిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.