Begin typing your search above and press return to search.

విడ్డూరం .. మాస్క్ తీసిన వ్యక్తి రెండు లక్షల జరిమానా!

By:  Tupaki Desk   |   2 Feb 2022 8:30 AM GMT
విడ్డూరం .. మాస్క్ తీసిన వ్యక్తి రెండు లక్షల జరిమానా!
X
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. మన దేశంలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా కానీ ఇతర దేశాల్లో ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో కొవిడ్ కేసులు భారీ స్థాయిలో బయటపడుతున్నాయి. కేవలం ఒక్క రోజులో నమోదు అయిన కేసులు సంఖ్య ఓ సారి చూస్తే 28 లక్షలు పైగా వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో ఒక్క ఫ్రాన్స్ లోనే నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగు చూసినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మరణాల సంఖ్య విషయానికి అత్యధికంగా అమెరికాలో నమోదు అయ్యాయి. సుమారు రెండు వేల ఏడు వందలకు పైగా మరణించారు. అమెరికాలో కేసులు కూడా రెండు లక్షలకు పైగా నమోదు కావడం గమనార్హం.

కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ ప్రోటోకాల్ ను కచ్చితంగా పాటించాలని చెబుతూ వస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా మూతి, ముక్కు బయటకు కనిపించకుండా మాస్క్ ధరించాలని మొదటి నుంచి చెప్తుంది. అయితే మన దేశంలో చాలా మంది దీనిని ఏదో నామ్ కే వాస్త్ అన్నట్లుగా పాటిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వారికి ఫైన్ వేస్తామని ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇవి కూడా అంతంత మాత్రంగా అమలు జరుగుతున్నాయి. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే బ్రిటన్ లో ఇందుకు భిన్నంగా ఉంది. మాస్క్ పెట్టుకోని ఓ వ్యక్తి కి గట్టి షాక్ ఇచ్చారు అక్కడి అధికారులు. సాధారణంగా మాస్క్ ధరించకపోతే కచ్చితంగా జరిమానా పడుతుందని ఇప్పటికే చాలా సార్లు అక్కడి ప్రభుత్వాలు చెప్తా వచ్చాయి. కానీ ప్రజలు సరిగా వినడం లేదని భరత్ అనే నేను సినిమాలో లాగా ఓ వ్యక్తికి భారీగా ఫైన్ వేశాయి.

ఇంగ్లాండ్ కు చెందిన క్టిస్టోఫర్ ఓ తూలే అనే వ్యక్తి షాపింగ్ కి అని వెళ్లారు. అయితే ఊపిరి సరిగా ఆడండం లేదని తను వేసుకున్న మాస్క్ ను కొంత సమయం పాటు తీశాడు. అదే అతని తప్పు అయ్యింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు అది గమనించి అతనికి భారీగా జరిమానా వేశారు. తాను ఇప్పుడే తీశాను అని ఎంత చెప్పినా వినలేదు. కచ్చితంగా జరిమానా 100 పౌండ్లు కట్టాలని నోటీసు కూడా పంపారు.

దీనిపై అతను తిరిగి సంబంధిత సంస్థకు మెయిల్ పెట్టాడు. కానీ లాభం లేకుండా పోయింది. వారు కూడా కచ్చితంగా మాస్క్ ధరించనందుకు ఫైన్ కట్టాల్సిందే అని తెగేసి చెప్పారు. కానీ దాన్ని కూడా క్రిస్టోఫర్ పట్టించుకోలేదు. దీంతో వారు ఏకంగా సుమారు భారత కరెన్సీలో 2 లక్షలకు పైగా జరిమానా వేశారు. అంతేగాకుండా పోలీసులు ఇంటికి వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై తాను న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు క్రిస్టోఫర్. నిజంగా కోర్టు రెండు లక్షలు కట్టాలని ఆదేశిస్తే అప్పుడు తప్పనిసరిగా కడతానని పేర్కొన్నాడు. కేవలం కొద్దిసేపు మాస్క్ తీసినందుకు ఇంత భారీ మూల్యం చెల్లించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్రిస్టోఫర్ కు మద్దతు పలుకుతున్నారు.