Begin typing your search above and press return to search.

మ‌ర‌ణం అంచుల వ‌ర‌కూ వెళ్లిన వారి మాట‌లివి

By:  Tupaki Desk   |   13 Nov 2017 4:20 AM GMT
మ‌ర‌ణం అంచుల వ‌ర‌కూ వెళ్లిన వారి మాట‌లివి
X
డ‌బ్బు క‌క్కుర్తి ప‌ద‌హారు నిండు ప్రాణాల్ని బ‌లి తీసుకుంది. మ‌రో 12 మందికి మృత్యుముఖం అంచు ముందు వ‌ర‌కూ తీసుకెళ్లింది. అప్ప‌టివ‌ర‌కూ ఆడుతూపాడుతూ ఉన్న వారంతా.. ఒక్కసారి మృత్యుభ‌యం వెంటాడితే.. ప్రాణాలు పోవ‌టం ఖాయ‌మ‌నుకున్న వేళ‌.. అదృష్ట‌వ‌శాత్తు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టినోళ్ల మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఆ స‌మ‌యంలో వారికేం గుర్తుకు వ‌చ్చి ఉంటుంది? అయినోళ్లు క‌ళ్ల ముందు మునిగిపోతుంటే ఎంత‌టి మాన‌సిక క్షోభ అనిపించి ఉంటారో కృష్ణ‌మ్మ బోటు బాధితుల మాట వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

క‌నీస అనుమ‌తులు లేకున్నా.. కాసుల క‌క్కుర్తితో ప్రాణాలు తీసిన బోటు స‌ర‌దా బాదితుల్ని బాధిస్తోంది. వారి స‌ర‌దా.. ఒక జీవితం కావ‌టం వారిని విల‌విల‌లాడేలా చేస్తోంది. అనుకోని రీతిలో ఎదురైన ప్ర‌మాదంతో చావు అంచుల వ‌ర‌కు వెళ్లిన కొంద‌రి మ‌నోగ‌తాన్ని చూస్తే..

ఒక్క అవ‌కాశం కావాలి.. బ‌త‌కాటానికి ఒక్క అవ‌కాశం ఇవ్వ‌వా అని వేడుకున్న‌ట్లు ఒక మ‌హిళ చెబితే.. మునిగిపోతున్న వేళ అంతా అయిపోయిన‌ట్లుగా అనిపించింద‌ని.. క‌ళ్ల ముందు పిల్ల‌లే గుర్తుకు వ‌చ్చిన‌ట్లుగా మ‌రో మ‌హిళ సేర్కొంది. ఇప్పుడిప్పుడే చ‌దువు పూర్తి చేశాను.. జాబ్‌.. మ్యారేజ్‌.. ఫ్యూచ‌ర్ మీద బెలెడ‌న్ని ఆశ‌లు ఉన్నాయి.. అవ‌న్నీ ఆక్ష‌ణంలో ఆవిరి అయిపోతున్న‌ట్లుగా అనిపించిందని.. ఏడుపు ఆగ‌లేద‌ని ఇర‌వైఏళ్ల యువ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఆ స‌మ‌యంలో ఏడుపు ఆగ‌లేద‌ని.. ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్లుగా పేర్కొంది. ఒంగోలుకు చెందిన సునీత మాట‌ల్లో చెప్పాలంటే.. గంట‌న్న‌ర పాటు ప‌డ‌వ‌లోనే ఉన్నామ‌ని.. ఉన్న‌ట్లుండి ప‌డ‌వ తిర‌గ‌బ‌డ‌టంతో ఏం జ‌రుగుతుందో అర్థ‌మ‌య్యే లోపే నీళ్ల‌ల్లో మునిగిపోయిన‌ట్లుగా పేర్కొన్నారు.

అరుపులు.. కేక‌లు..ఏడుపుల‌తో గ‌గ్గోలుగా మారింద‌ని.. క‌ళ్ల ముందే కృష్ణ‌మ్మ నీటిలో కిలిసిపోయార‌ని.. కొంద‌రి ఆచూకీ కూడా దొర‌క‌టం లేద‌న్నారు. తాను బ‌తుకుతాన‌ని అనుకోలేద‌ని.. ఆ స‌మ‌యంలో హాస్ట‌ల్ లో చ‌దువుకుంటున్న కొడుకు ఎలా ఉన్నాడ‌న్న సందేహంతో పాటు.. భ‌ర్త ఎక్క‌డ ప‌డిపోయారు? ఇద్ద‌రం బ‌తికితే చాలురా భ‌గ‌వంతుడా.. కృష్ణ‌మ్మ త‌ల్లి బ‌తికించు అని వేడుకున్న‌ట్లుగా చెప్పారు. మ‌రో బాధితుడు హ‌రిబాబు మాట్లాడుతూ.. త‌న ప‌క్క‌నున్న చాలామంది నీటిలో మునిగిపోతున్నార‌ని..ఆ వేళ‌లో త‌న‌కు త‌న పిల్ల‌లు.. బంధువులు క‌ళ్ల ముందు మెదిలార‌ని.. జీవితం మొత్తం ఒక్క‌సారి క‌ళ్ల ముందు క‌ద‌లాడింద‌న్నారు. బ‌తికితే దేవుడి చ‌ల‌వేన‌ని అనుకున్నాన‌ని.. ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని ద‌గ్గ‌ర‌గా చూశాన‌న్నారు.

త‌న‌తో పాటు అన్న‌య్య‌.. వ‌దిన‌.. వియ్య‌పురాలు అంతా క‌లిసి బోటు ఎక్కామ‌ని.. ఆసుప‌త్రిలో కోలుకుంటున్న సుబ్బాయమ్మ తెలిపారు. ఒంగోలు నుంచి వ‌చ్చిన యాభై మందిలో కొంద‌రం భ‌వానీ ద్వీపం నుంచి ప‌విత్ర సంగ‌మానికి ప్రైవేటు బోటులో వెళ్లామ‌న్నారు. బోటు ఓ ప‌క్క‌కు ఒరిగిపోవ‌టంతో ప‌డ‌వ మునిగిపోయిన‌ట్లుగా ఆమె చెప్పారు. త‌న‌కు ఒక చెక్క దొరికితే దాన్ని ప‌ట్టుకొని ఉండిపోయాన‌ని.. త‌ర్వాత ఎవ‌రో వ‌చ్చి కాపాడిన‌ట్లుగా పేర్కొన్నారు.