Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు... వైసీపీ మాటేంటి...?

By:  Tupaki Desk   |   14 May 2022 7:28 AM GMT
కొత్త రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు... వైసీపీ మాటేంటి...?
X
ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా ప్రమోట్ అయితే అది నిజంగా గ్రేట్. అంతే కాదు అపుడెపుడో దాదాపు అయిదు దశాబ్దాల నాడు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. ఆ గ్యాప్ ని మళ్లీ భర్తీ చేసే వారిగా వెంకయ్యనాయుడు ఉంటారు. ఇక బీజేపీలో డజన్ల కొద్దీ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నేటి యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్ కూడా ఉన్నారు. ఆమె మోడీ వారసురాలిగా అప్పట్లో గుజరాత్ సీఎం గా కూడా పనిచేశారు.

ఇక ప్రతిభా పాటిల్ 2007లో మహిళా రాష్ట్రపతిగా చేసిన తరువాత మళ్లీ మరో మహిళ ఎవరూ ఆ ప్లేస్ లోకి రాలేదు. అలా ఉమెన్ కార్డ్ కూడా బీజేపీ ప్రయోగిస్తుంది అంటున్నారు. అయితే బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలి అంటే సౌత్ ఓట్లు కూడా కావాలి. మెజారిటీకి దగ్గరగా ఉన్నా ఏదో ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ మద్దతు అవసరం. ఆ విషయంలో ఎక్కువగా వైసీపీనే బీజేపీ నమ్ముకుంది అంటున్నారు.

అయితే బీజేపీ మదిలో సౌత్ నుంచి పొలిటికల్ ఫోకస్ పెంచాలన్న ఆలోచన ఉందిట. అందుకే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పూర్వాశ్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సౌత్ లో ఆయన ఇమేజ్ ని ఉపయోగించుకుంటే 2024 ఎన్నికల్లో ఒడ్డెక్కవచ్చు అన్న వ్యూహం ఉంది అంటున్నారు.

అయితే వెంకయ్యనాయుడుకు సౌత్ నుంచి మద్దతు ఏఏ పార్టీల నుంచి దక్కుతుంది అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ యూపీయేలోనే ఉన్నారు, సో ఆయన కచ్చితంగా ఎన్డీయేకు మద్దతు ఇవ్వరు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం కూడా బీజేపీకి మద్దతు ఇవ్వదు. ఇక కర్నాటకలో ఎటూ బీజేపీ సర్కార్ ఉంది. నో ప్రాబ్లెం. రెండు తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే టీయారెస్ వైసీపీ ఉన్నాయి. ఇందులో టీయారెస్ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టి అది జనంలో చూపించి రాజకీయంగా హిట్ కావాలన్నది గులాబీ పార్టీ అజెండా.

మరి అలాంటి టీయారెస్ కోరి కోరి సాటి తెలుగు వారు అని వెంకయ్యనాయుడుకు మద్దతు ఇస్తుందా అన్నది చర్చ. ఇక వైసీపీ విషయానికి వస్తే బీజేపీకే మద్దతు. ఈ విషయంలో రెండవ మాటకు అవకాశం లేదు అంటున్నారు. కానీ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అంటే వైసీపీ ఎంతవరకూ ఓకే చెబుతుంది అన్నదే చర్చ.

ఎందుకంటే వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఏపీలో టూర్లు చేసినా కూడా ఏపీ సర్కార్ పెద్దగా ఆయనతో కనిపించినది లేదు. జగన్ సైతం ఒకే ఒక్కసారి ఢిల్లీలో వెంకయ్యనాయుడుని కలసి వచ్చారు. అది కూడా కొత్తల్లో. ఇక జగన్ సర్కార్ ఇంగ్లీష్ చదువుని సర్కార్ బడులలో పెడతాము అంటే మాతృభాష తెలుగు ఉండాలని వెంకయ్యనాయుడు అప్పట్లో ఏపీ టూర్లో గట్టిగా చెప్పిన సంగతీ విధితమే.

ఇదిలా ఉండగా వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కూడా జగన్ ఆయన మీద కూడా నేరుగా విమర్శలు చేశారు. మీ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదవవచ్చు. పేదవారు చదవకూడదా అంటూ కామెంట్స్ చేశారు. ఇలా ఒక పెద్ద గ్యాప్ అయితే వెంకయ్యనాయుడుతో వైసీపీకి ఉందని అంటున్నారు. దాంతో వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం అంటే వైసీపీ ఓకే చెబుతుందా అన్నదే చర్చ.

అయితే ఇక్కడ మోడీని బట్టే జగన్ తన నిర్ణయం ప్రకటిస్తారు తప్ప ఎవరు క్యాండిడేట్ అని చూడరని కూడా అంటున్నారు. అలా కనుక జరిగితే మాత్రం గుత్తమొత్తంగా వైసీపీ ఓట్లు వెంకయ్యనాయుడుకి పడతాయని అంటున్నారు. ఒక వేళ ఏమైనా మెలిక పెడితే మాత్రం బీజేపీ కూడా ఆలోచనలో పడుతుంది అనే అంటున్నారు.

అయితే ఇక్కడ వైసీపీ అయినా టీయారెస్ అయినా దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవి రాష్ట్రపతి పదవి ఒక తెలుగు నాయకుడికి వస్తే సంకుచితంగా ఆలోచించి ఆయన అవకాశాలకు గండి కొట్టవనే అంటున్నారు. అలాగే కనుక జరిగితే తెలుగు జనాలకు వారు జవాబు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ రకమైన ఈక్వేషన్స్ పనిచేస్తే తప్పకుండా కొత్త రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.