Begin typing your search above and press return to search.

వెంకయ్య అసహనం.. ధర్మ సమ్మతమేనా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 1:30 PM GMT
వెంకయ్య అసహనం.. ధర్మ సమ్మతమేనా?
X
తామ చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం.. అనే నీతిని రాజకీయ నాయకులు తరచూ పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలకోసం రాజ్యసభలో తమ నిరసనలను గట్టిగా వినిపించదలచుకుంటున్న వారి మీద అసహనంతో ఊగిపోతున్నారు. ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. ‘‘యూకెనాట్ డిక్టేట్ మీ.. మీ డిమాండ్లేవీ రికార్డుల్లోకి ఎక్కవు.. ప్రజాసంక్షేమంపై శ్రద్ధ లేదా.. గో బ్యాక్’’ అంటూ డబాయిస్తున్నారు. శాసించగల కుర్చీలో కూర్చున్నారు గనుక.. ఆయన ఆగ్రహిస్తున్నారు సరే.. ఇంతకూ ఆయన అసహనం - ఆగ్రహావేశాలు ధర్మ సమ్మతమైనవేనా? అనేదే ప్రజల్లో మెదలుతున్న సందేహం.

కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి అస్తిత్వం లేదనే సంగతి ఆయనకు పక్కాగా తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజల మన్నన చూరగొనగలడం కూడా అంత ఈజీ కాదని కూడా ఆయనకు తెలుసు. కానీ.. ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సభా ముఖంగా ప్రశ్నించడానికి మాత్రం వెనుకాడ్డం లేదు. బడ్జెట్ లో జరిగిన అన్యాయం గురించి గత శుక్రవారం నాడే రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని ‘ ఏం పిచ్చెక్కిందా’ అంటూ కురియన్ తో తిట్టించుకున్న కేవీపీ రామచంద్రరావు.. సోమవారం కూడా తన నిరసనల్ని కొనసాగించారు. ఇవాళ కూడా ఆయన ప్లకార్డులతో సభాపతి ఎదుట వెల్ లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు.

ఇలాంటి నిరసనలకు రాజ్యసభలో ఎంతకాలం పాటూ సభ్యుడిగా కొనసాగిన వెంకయ్యనాయుడుకు కొత్తవేమీ కాదు. ఆయన స్వయంగా అలాంటి పనులు చేయని వ్యక్తి కూడా కాదు. కాకపోతే.. ఇవాళ తాను సీటు మారి.. ఛైర్ లోకి వచ్చేసరికి ఆయన చేతికి బెత్తం వచ్చింది. దాన్ని ఝుళిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగైతే సభను వాయిదా వేసేస్తా అని బెదిరిస్తున్నారు.

మీ మాటలేవీ రికార్డుల్లోకి వెళ్లవు.. అని ఆయన ఎంపీ కేవీపీ రామచంద్రరావును బెదిరించవచ్చు గాక.. రికార్డుల్లోకి వెళ్లినంత మాత్రాన ఏం ఒరుగుతుంది గనుక..? వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళితే కేటాయింపులు పెరుగుతాయా, కేంద్రంలో కదలిక వస్తుందా... కనీసం కేవీపీ నిరసనలు తెలియజేస్తోంటే.. ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా అణగదొక్కేస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే.. వారు ఛీత్కరించుకుంటారనే భయం పాలకుల్లో పుడుతుంది కదా.. అనేది విశ్లేషకుల అభిప్రాయం. తను అసహనం వెలిబుచ్చినా అది ధర్మసమ్మతంగా ఉండాలని.. ఆంధ్రప్రదేశ్ కే చెందిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు గ్రహించాలి. ఏపీ ప్రజలు తన వైఖరి పట్ల కూడా విముఖత చూపే పరిస్థితి రాకూడదని ఆయన తెలుసుకోవాలని అంతా కోరుకుంటున్నారు.