Begin typing your search above and press return to search.

పార్టీ ఫిరాయింపులు.. వెంకయ్య పోటు

By:  Tupaki Desk   |   27 Aug 2019 11:04 AM GMT
పార్టీ ఫిరాయింపులు.. వెంకయ్య పోటు
X
ఉపరాష్ట్రపతిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకయ్యనాయుడుకు విజయవాడలోని గేట్ వే హోటల్ లో ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తనను ఉపరాష్ట్రపతిని చేస్తానన్న మోడీ ప్రతిపాదన తనకు ఇష్టం లేదని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండని ఆ పదవిని వద్దన్నానని వివరించారు. అయితే మోడీ మాత్రం ఏ పదవిని, ఎలా మలుచుకోవాలనే తనకు బాగా తెలుసునని తనను ఒప్పించారని గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ ప్రబలంగా నిలబడిందని.. ఇన్నాళ్లు అమెరికా వైపు చూసే దేశాలు.. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే భారత్ వైపు చూస్తున్నాయని వెంకయ్య చెప్పుకొచ్చాడు.ఇక దేశంలోని 22 జిల్లాలు పర్యటించి జనజీవనాన్ని తాను బాగా అధ్యయనం చేశానని వివరించారు.

రాజకీయ పార్టీలు, సభ్యులు విలువలు కలిగి ఉండాలని వెంకయ్య హితవు పలికారు. ఏపీలో గతంలో పార్టీ ఫిరాయింపులు చేసి ఏకంగా వారికి మంత్రి పదవులు ఇచ్చినా స్పీకర్ చర్య తీసుకోలేదని.. దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నించారు. 10వ షెడ్యూల్ లో మార్పు చేయాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని వెంకయ్య స్పష్టం చేశారు.

ఇక మాతృభాషలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను బోధించాలని వెంకయ్య కోరారు. భాష అనేది మన సంస్కృతిలో భాగమని అన్నారు. ఆర్టికల్ 370 విభజించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని.. తెలంగాణ బిల్లులాగా రభస జరిగి తలుపులు మూసి, టీవీ ఆఫ్ చేసి అందరినీ బయటకు పంపేసిన పరిస్థితులు వస్తాయా అని భయపడ్డానని వెంకయ్య తెలిపారు. నేను సభకు అధ్యక్షుడిగా ఉండగా అలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. ఈ బిల్లుతో కశ్మీర్ కు ఎంతో లాభం అన్నారు.