Begin typing your search above and press return to search.

సోదరుడ్ని కోల్పోయాను.. సోనియా ఆవేదన

By:  Tupaki Desk   |   25 Nov 2020 12:15 PM IST
సోదరుడ్ని కోల్పోయాను.. సోనియా ఆవేదన
X
కాంగ్రెస్ కీలక నేత.. పార్టీ వ్యూహకర్తల్లో ఒకరైనా అహ్మద్ పటేల్ మరణంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ స్పందించారు. తాను సోదరుడ్ని కోల్పోయినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఆయన మరణం తాలుకూ షాక్ నుంచి ఆమె బయటకు రాలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో సలహాల కోసం ఎన్నోసార్లు ఆయన్ను సంప్రదించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.

అహ్మద్ పటేల్ గురించి సోనియా చెబుతూ.. ‘‘ కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అహ్మద్ పటేల్ ను కోల్పోయాను. విధుల పట్ల ఆయనకున్న నిబద్ధత.. బాధ్యత.. విశ్వసనీయత ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఒక నమ్మకమైన సహచరుడు.. స్నేహితుడు.. సోదరుడుగా ఉన్న వ్యక్తిని ఈ రోజు నేను కోల్పోయాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. అహ్మద్ పటేల్ మరణంపై రాహుల్ గాంధీ తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఒక దుర్దినంగా పేర్కొన్న ఆయన.. పార్టీకి ఆయనో మూలస్తంభమన్నారు. కాంగ్రెస్ పార్టీయే శ్వాసగా ఆయన జీవించారని.. క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారన్నారు. ఇకపై ఆయన మాతో లేకపోవటం పూడ్చలేని లోటుగా అభివర్ణించారు. రాహుల్ సోదరి ప్రియాంక సైతం అహ్మద్ పటేల్ మరణంపై రియాక్ట్ అయ్యారు. ఏ సలహా కోసం వెళ్లినా సరైన మార్గదర్శనం చేసేవారన్న ఆమె.. ఆయన లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి తీర్చలేని లోటుగా పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ మరణంపై గాంధీ కుటుంబం స్పందించిన తీరు చూస్తే.. పార్టీకి ఆయన ఎంత కీలకమైన వ్యక్తి అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.