Begin typing your search above and press return to search.

ఎన్జీ రంగా మునిమ‌న‌మ‌డు పెళ్లి జ‌రిగిందోచ్‌!

By:  Tupaki Desk   |   9 March 2018 5:04 AM GMT
ఎన్జీ రంగా మునిమ‌న‌మ‌డు పెళ్లి  జ‌రిగిందోచ్‌!
X
ఎన్జీ రంగా ఎవ‌రు? అని ఇప్ప‌టి త‌రం అడ‌గొచ్చేమో కానీ.. డెబ్భైల చివ‌ర్లో పుట్టిన వారికి సుప‌రిచిత‌మే. నిరాడంబ‌రంగా జీవించ‌ట‌మే కాదు.. రాజ‌కీయాల్లో ఉండి కూడా రైతుల కోసం.. వ్య‌వ‌సాయం కోసం ఆయ‌న చేసిన కృషి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రికార్డు స్థాయిలో(ఆ మ‌ధ్య‌నే ఆయ‌న రికార్డు బ్రేక్ అయిపోయింద‌నుకోండి) చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైన ఆయ‌న్ను పద్మ‌విభూష‌ణ్‌ తో భార‌త స‌ర్కారు స‌త్క‌రించింది కూడా.

భార‌త రైతాంగం కోసం ఆయ‌న పోరాడిన తీరు అంతా ఇంతా కాదు. అందుకే ఆయ‌న్ను రైతాంగ ఉద్య‌మ పితామ‌హుడిగా అభివ‌ర్ణిస్తారు. ఆయ‌న పుట్టింది నిడుబ్రోలు (గుంటూరు జిల్లా పొన్నురు పాత ప‌ట్ట‌ణంగా చెప్పాలి) కాగా.. మ‌ర‌ణించింది పొన్నూరులోనే. రైతుల‌కు ఆయ‌న చేసిన సేవ‌ల‌కు చిహ్నంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యానికి ఆచార్య ఎన్జీ రంగా అన్న పేరును ప్ర‌భుత్వం పెట్ట‌టం.. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు సైతం అదే పేరునుకంటిన్యూ చేయ‌టం చూస్తే.. ఆయ‌న ఎలాంటి వ్య‌క్తో ఇట్టే అర్థ‌మ‌వుతుంది కూడా.

ఉన్న‌ట్లుండి ఎన్జీ రంగా గురించి ఇప్పుడు ప్ర‌స్తావించాల్సిన అవస‌రం ఏమిటంటారా? దీనికో ప్ర‌త్యేక కార‌ణం ఉంది. దేశ వ్యాపార కుటుంబాల్లో పేరుప్ర‌ఖ్యాతులున్న టీవీఎస్‌.. ద అమాల్గ‌మేష‌న్ గ్రూప్ ల మ‌న‌మ‌రాలైన ల‌క్ష్మీ వేణు పెళ్లి ఇటీవ‌ల జ‌రిగింది. ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రో తెలుసా? ఎన్జీరంగా మునిమ‌న‌మ‌డితో.

రైతుల కోసం.. రైతాంగం కోసం పోరాడిన నేత మునిమ‌న‌మ‌డి పెళ్లి ఒక ప్ర‌ముఖ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయితో జ‌ర‌గ‌టం ఒక విశేషంగా చెప్పాలి. ఇక‌.. రంగా మునిమ‌న‌డు ఇప్పుడేం చేస్తున్నాడ‌న్న‌ది చూస్తే.. ఇత‌డిపేరు మ‌హేశ్ గోగినేని. బిట్స్ పిలానీ.. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్ ల‌లో గ్రాడ్యుయేష‌న్ చేసి ష్టాన్ ఫోర్డ్ వ‌ర్సిటీలో ఏంబీఏ చేశాడు. ఒక స్టార‌ప్ ని స‌క్సెస్ ఫుల్ గా న‌డిపిస్తున్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం గిఫ్ స్కీ అనే మ‌రో సార్ట్ ప్ సంస్థ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇత‌నికి టీవీఎస్ శ్రీ‌నివాస్‌.. ద అమాల్గ‌మేష‌న్స్ గ్రూప్ శివ‌శైలంద్ర మ‌న‌మ‌రాలు ల‌క్ష్మీ వేణుతో పెళ్లి వేడుక జ‌రిగింది. జోధ్‌పూర్ లో జ‌రిగిన ఈ పెళ్లి పూర్తి ద‌క్షిణ భార‌త సంప్ర‌దాయంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు.. అతి ద‌గ్గ‌ర స్నేహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు చెబుతున్నారు.

ఈ పెళ్లికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణం ఏమిటంటే.. ల‌క్ష్మీ వేణు గ‌తంలో పెళ్లి జ‌రిగింది. ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తితో 2011లో పెళ్లి జ‌రిగింది. అనంత‌రం 2015లో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో వారు విడిపోయారు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ వేణు.. సుంద‌ర‌మ్ క్లేటాన్ కు ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ట‌ఫే మోటార్స్ అండ్ ట్రాక్ట‌ర్స్ కు డైరెక్ట‌ర్ గానూ ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.