Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డిని సస్పెండ్ చేస్తారా?

By:  Tupaki Desk   |   23 Oct 2022 1:30 AM GMT
కోమటిరెడ్డిని సస్పెండ్ చేస్తారా?
X
కాంగ్రెస్ ఎంపీగా ఉండి పార్టీలో అసంతృప్తి రాజేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటకట్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరిన తన తమ్ముడిని గెలిపించండి అంటూ ఫోన్లు చేసి అడ్డంగా దొరకడంతో కాంగ్రెస్ వాదులు అంతా మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే రేవంత్ రెడ్డి పీసీసీ పదవి పోతుందని.. తనకు వస్తుందని.. పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. తన తమ్ముడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓపెన్ గానే ఆయన చెబుతుండడం దుమారం రేపుతోంది.

వెంకటరెడ్డి వ్యాఖ్యలు వైరల్ కావడంతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన స్రవంతి తాను వెంకటరెడ్డిని సొంత అన్నగా భావించానని చెప్పుకొచ్చారు. తాను ఆడబిడ్డగా మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నానని స్రవంతి చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డిని కలిసిన తాను ఉప ఎన్నికల్లో సహకరించాలని.. తనకు ధైర్యం కూడా ఆయనేనని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి తీరు తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు. పార్టీ ఎంపీగా ఉంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నమ్మకద్రోహంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

తనకు ఆర్థికంగా బలం లేకపోవచ్చు కానీ.. ప్రజా బలం ఉందని స్రవంతి చెప్పుకొచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ లో వెలుగులోకి వచ్చిన సంభాషణతోపాటు గా.. ఆస్ట్రేలియాలో పార్టీ కార్యకర్తలతో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. వెంకటరెడ్డి అసలు మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పడం పెనుదమారం రేపుతోంది. తాను మునుగోడుకు వెళ్లి ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయన్నారు. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు కొట్లాడుతున్నప్పుడు ఏం చేయగలుగుతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల స్థాయిలో డబ్బులు పెట్టలేదన్నారు. పార్టీ ఎవరు డబ్బులు పెట్టాలని ప్రశ్నించారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలని చెప్పుకొచ్చారు. తాను పాదయాత్ర చేద్దామనుకున్నానని.. అయితే కాంగ్రెస్ లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపుగా ఉందన్నారు. తాను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదనని అన్నారు.ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని ప్రశ్నించారు.

మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్పలేమని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మునుగోడులో మూడుప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

కోమటిరెడ్డిపైన చర్యలకు రంగం సిద్ధం అవుతోందనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. మునుగోడు బైపోల్ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యవహారం రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర వేళ బిగ్ డిబేట్ గా మారుతోంది.