Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌కు పెద్ద బాధ్య‌త‌లే అప్ప‌గించారు

By:  Tupaki Desk   |   13 March 2017 6:31 AM GMT
వెంక‌య్య‌కు పెద్ద బాధ్య‌త‌లే అప్ప‌గించారు
X
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు బీజేపీ పెద్ద బాధ్య‌త‌లే అప్ప‌గించింది. అనూహ్య‌రీతిలో బంప‌ర్ మెజార్టీ సాధించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇక ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌నుంది. యూపీ ప‌రిశీలకుడిగా నియమిస్తూ బీజేపీ కీలక బాధ్యతలు క‌ట్ట‌బెట్టింది. ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌ లోని ఎమ్మెల్యేలతో వెంకయ్య భేటీ అయ్యే అవకాశముంది. అదే రోజు యూపీ ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది. ఈ నేప‌థ్యంలో శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం - ఎమ్మెల్యేల మ‌ధ్య స‌మ‌న్వ‌యం - సీఎం ఎంపిక‌ వంటి అంశాల్లో వెంక‌య్య‌ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు.

ఈనెల 16న లక్నోలో బీజేపీ శాసనసభాపక్షం భేటీ కానుంది. అప్పుడు జరిగే కీలక సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీర్మానించింది. యూపీ సీఎం రేసులో... కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - బీజేపీ యూపీ ముఖ్య‌నేత‌లు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య - దినేష్‌ శర్మ - మహంత్‌ ఆదిత్యనాధ్‌ - మనోజ్‌ సిన్హా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో యూపీ సీఎంగా పనిచేసిన రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు తిరిగి బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కాగా, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం అనంత‌రం వెంక‌య్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్నారని తెలిపారు. బీజేపీకి యూపీలో 39.6 - ఉత్తరాఖండ్‌ లో 46.5 శాతం ఓట్లు - మణిపూర్‌ లో 36.2 - గోవాలో 34 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వ లేమితో బాధ పడుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ మరింత బలహీనపడుతుందని వెంక‌య్య నాయుడు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును విపక్షాలు బలపర్చాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/