Begin typing your search above and press return to search.

వెంకయ్యనాయుడు పెళ్లి గోల

By:  Tupaki Desk   |   19 Sept 2016 11:00 PM IST
వెంకయ్యనాయుడు పెళ్లి గోల
X
చెణుకులు - పిట్టకథలతో ఆకట్టుకునే ప్రసంగాలు చేసే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రసంగంతో జనాలను ఆకట్టకున్నారు. అంతేకాదు... వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రి సుజనాచౌదరిలు కూడా వెంకయ్య మాటలకు నవ్వాపుకోలేకపోయారు. కాంగ్రెస్ ను విమర్శిస్తూ వెంకయ్య చెప్పిన పిట్టకథకు అంతా పగలబడి నవ్వారు. కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక ఆత్రం పెళ్లి కొడుకుగా వర్ణించి వర్ణించి వెంకయ్య మాట్లాడడంతో ఒకటే నవ్వుల పువ్వులు.

కృష్ణా జిల్లా నిమ్మకూరు - నెమ్మలూరు మధ్య బెల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ రోజు అక్కడ సభ ఏర్పాటు చేశారు. సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఏకిపడేశారు. తొందరపాటు పెళ్లికొడుకు కథను చెప్పించి కామెడీ చేశారు.

50 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమకు ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారని.. కానీ.. కాంగ్రెసోళ్లు అయిదేళ్లు కూడా ఆగలేకపోతున్నారని.. 2019 వరకు ఓపికపడితే ఎలా ఉంటుందో చూడొచ్చన్నారు. అలా కాకుండా ఎక్కువ ఆత్రపడితే మరో 50 ఏళ్ల వరకు వారికి అధికారం అందదన్నట్లుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పిట్టకథ ఒకటి చెప్పారు. ''వెనకటికి ఒకాయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేయాలని తండ్రి వద్ద గొడవ పెడుతున్నాడు. కుర్రాడి తండ్రి మాత్రం అప్పుడే ఇంకా నీకు పెళ్లి టైం రాలేదురా నాయనా కాస్త ఆగు.. అని చెప్పాడు. అయినా నాకు తొందరగా పెళ్లి కావాలి అంటూ ఊళ్లో అందరికీ చెప్పుకొంటూ.. మా నాన్న నాకు పెళ్లి చేయడం లేదంటూ ప్రచారం చేసి ఎలాగైతేనేం పెళ్లి చేసుకున్నాడు. కానీ... పెళ్లయిన రెండేళ్లయినా పిల్లాజెల్లా లేరు. మూడేళ్లయింది అయినా ఏమీ కాలేదు... అయిదేళ్లు.. పదేళ్లయినా ఏం కాలేదు. ఏందిరా అంత గొడవ జేస్తివి, మీ నాయన ప్రాణం తీస్తివి. పదేళ్లయినా ఇంకా ఏం కాలేదంటే ఎలారా? అంటే నాకు ఇంకో చాన్సిచ్చి చూడండి, ఈ సారి చూపిస్తా నా తడాఖా అన్నాడట" అంటూ నవ్వించారు. కాంగ్రెస్ అధికారం పోగొట్టుకుని మళ్లీ అధికారం కోసం తొందరపడుతున్నా ఎన్నేళ్లయినా కూడా మళ్లీ ప్రజాదరణ పొందలేకపోతోందన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వెంకయ్య నాయుడు ఈ మాటలు చెబుతుంటే చంద్రబాబు - సుజనాలు సహా అక్కడున్నవారంతా ఒకటే నవ్వులు.