Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్రప‌తి వద్దు బాబోయ్ అంటున్న వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   28 Jun 2017 11:30 AM IST
ఉప‌రాష్ట్రప‌తి వద్దు బాబోయ్ అంటున్న వెంక‌య్య‌
X
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో వినిపించిన‌ట్లే ఉప రాష్ట్రప‌తి పోరు గ‌డువు స‌మీపిస్తున్న స‌మ‌యంలో బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. ఉత్త‌రాది ప్రాంత నేత‌ను రాష్ట్రప‌తి ప‌దవి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ద‌క్షిణాది నాయ‌కుడికే ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి అభ్య‌ర్థిత్వం ఖాయ‌మ‌ని, ఇందులో భాగంగా పార్టీ సీనియ‌ర్ అయిన వెంక‌య్య పేరును తీవ్రంగా ప‌రిశీలిస్తున్నార‌ని ప‌లు వ‌ర్గాలు విశ్లేషించాయి. ఈ ప్ర‌చారంపై తాజాగా వెంక‌య్య నాయుడు స్పందించారు. రాజ్యాంగ పదవులపై తనకెప్పుడూ ఆసక్తి లేదని, అవి తనను ప్రజలనుంచి దూరం చేస్తాయని వెంక‌య్య‌నాయుడు స్పష్టం చేశారు.

ఢిల్లీలో విలేక‌రుల‌తో మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు ప్రజలతో మమేకం కావడం తనకెంతో ఇష్టమని, వారికి దూరంగా ఉండలేనని తెలిపారు. ఎవరు బలవంతం చేసినా ఉపరాష్టప్రతి పదవికి తాను పోటీచేయబోనని పునరుద్ఘాటించారు. తాను అనుకున్నది మాట్లాడటం, వివిధ ప్రదేశాలు తిరగడం, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, వారి ఆహారం తినడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలను కలవడం, వారికి సేవ చేయడమే తనకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ‘ఎవరు ఎలాంటి ఒత్తిడి చేసినా ఉపరాష్ట్రప‌తి ఎన్నికల్లో పోటీచేయను’ అని వెంకయ్య స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో సైతం వెంక‌య్య‌నాయుడు పేరు ప్ర‌స్తావ‌న‌కు రాగా దాన్ని సున్నితంగా తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. తాను ఉషాప‌తిగా ఉంటానే త‌ప్ప రాష్ట్రప‌తిగా ఉండ‌న‌ని వెంక‌య్య తెలిపారు. త‌న స‌తీమ‌ణి ఉష పేరును ప్ర‌స్తావిస్తూ రాష్ట్రప‌తి ప‌ద‌విని తిర‌స్క‌రించే అంశాన్ని అలా చ‌మ‌త్కారంగా వెంక‌య్య వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/