Begin typing your search above and press return to search.

మోడీ వ్యాఖ్య‌ల్ని రికార్డుల్లో నుంచి తీసేసిన వెంక‌య్య‌!

By:  Tupaki Desk   |   11 Aug 2018 12:30 PM IST
మోడీ వ్యాఖ్య‌ల్ని రికార్డుల్లో నుంచి తీసేసిన వెంక‌య్య‌!
X
ఊహించ‌ని స‌న్నివేశం ఒక‌టి పార్ల‌మెంటులో చోటు చేసుకుంది. పార్ల‌మెంటు చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకొని అరుదైన ఘ‌ట‌న తాజాగా రాజ్య‌స‌భ‌లో చోటు చేసుకుంది. సాధార‌ణంగా విప‌క్ష నేత‌ల వ్యాఖ్య‌ల్ని రికార్డుల్లో నుంచి తొల‌గించ‌టం మామూలే. దీనికి భిన్నంగా ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల్ని తొల‌గిస్తూ రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

దేశ చ‌రిత్ర‌లో ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల్ని పార్ల‌మెంటు రికార్డుల నుంచి తొల‌గించ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇందుకు దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? మోడీ ఏమ‌ని వ్యాఖ్యానించారు? ఎందుకు రికార్డుల నుంచి తొల‌గించార‌న్న‌ది చూస్తే..

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎన్నిక‌లు పోటాపోటీగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయే నుంచి హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ గెలుపొందారు. ఆయ‌న‌పై పోటీ చేసిన విపక్షాల అభ్య‌ర్థి బీకే హ‌రిప్ర‌సాద్ ఓడిపోయారు. ఎన్నిక‌ల ఫ‌లితం వెలువ‌డిన వెంట‌నే రాజ్య‌స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. డిప్యూటీ ఛైర్మ‌న్ గా ఎన్నికైన హ‌రి వంశ్ నారాయ‌ణ్ ను అభినందించారు.

ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా మారాయి. విప‌క్ష అభ్య‌ర్థి బీకే హ‌రిపై మోడీ ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. త‌నదైన శైలిలో శ్లేషతో కూడిన చ‌మ‌క్కుల్ని ప్ర‌యోగించారు. మోడీ చేసిన వ్యాఖ్య‌ల్ని తెలుగులో చూస్తే.. ఇరువైపులా హ‌రి అన్న పేరున్న వ్య‌క్తులే ఉన్నారు. ఒక‌రి ఇంటి పేరు బీకే (హిందీలో బీకే అంటే అమ్ముడుపోవ‌టం అన్న అర్థం ఉంది).. కానీ ఆయ‌న అమ్ముడు పోలేదు. ఇక్క‌డ మ‌రో బీకే అమ్ముడుపోయారు. కానీ మ‌రో హ‌రి మాత్రం అమ్ముడు పోలేదంటూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అభ్య‌ర్థి బీకే హ‌రి అమ్ముడు పోయార‌ని.. కానీ గెల‌వ‌లేద‌ని.. కానీ.. త‌మ పార్టీ అభ్య‌ర్థి హ‌రి మాత్రం అమ్ముడుపోలేద‌న్న అర్థం వ‌చ్చేలా చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అస‌లే ఓట‌మి వేద‌న‌తో ఉన్న హ‌రిప్ర‌సాద్ మోడీ మాట‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని హోదాను.. స‌భ గౌర‌వాన్ని ఆయ‌న దిగ‌జార్చారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనిపై చేసిన ఫిర్యాదును పరిశీలించిన రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ రికార్డుల నుంచి మోడీ చేసిన వ్యాఖ్య‌ను తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఊహించ‌ని తీరుతో చోటు చేసుకున్న ఈ వైనంపై బీజేపీ డిఫెన్స్ లోప‌డింది. అంత‌లోనే క‌వ‌ర్ చేస్తూ.. మోడీ వ్యాఖ్య‌ల తొల‌గింపు ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నిష్ప‌క్ష‌పాక్షిక‌త‌కు నిద‌ర్శ‌నంగా బీజేపీ నేత‌లు గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. వెంక‌య్య గొప్ప‌త‌నం స‌రే.. ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ ఇలా మాట్లాడ‌టం ఏమిట‌న్న దానిపైన వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది.