Begin typing your search above and press return to search.

కొత్త పార్లమెంటు భవనం కట్టేద్దాం

By:  Tupaki Desk   |   28 Dec 2015 4:03 AM GMT
కొత్త పార్లమెంటు భవనం కట్టేద్దాం
X
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తాజాగా రాసిన లేఖ ఒకటి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత అవసరాలు తీర్చే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్న పార్లమెంటు భవనంతో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని.. అందుకే.. కొత్త భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనతో కూడిన లేఖను రాశారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని 1927లో నిర్మించారు. గడిచిన 88 ఏళ్లుగా పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరోవైపు 2026లో పార్లమెంటులో సభ్యుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో.. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తిస్తూ.. తాజాగా వెంకయ్యనాయుడికి లోక్ సభా స్పీకర్ సుమిత్రా మహాజన్ లేఖ రాశారు. గతంలో పార్లమెంటులో కార్యకలాపాలు పరిమితంగా సాగేవని.. ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయని.. భవిష్యత్తులో మరిన్ని కార్యకలాపాలు పెరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడున్న పార్లమెంటు భవనంతో సాధ్యం కాదని.. కొత్త దాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు.

ప్రస్తుత పార్లమెంటు భవనం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోదని.. స్థలం కోసం పెరుగుతునన డిమాండ్లను.. భవిష్యత్తు అవసరాల్ని తీరచేలా కసరత్తు చేయాల్సిన అవసరాన్నిఆమె ప్రస్తావించారు. ఇందుకోసం లోక్ సభా స్పీకర్ రెండు ప్రతిపాదనలు చేశారు. అందులో ఒకటి.. ప్రస్తుత పార్లమెంటు భవన ప్రాంగణలోనే మరో భారీ నిర్మాణాన్ని చేపట్టటం ఒకటి. మరొకటి.. రాజ్ భవన్ కు మరోవైపు భారీగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించటం. అయితే.. ప్రస్తుత పార్లమెంటు నుంచి కొత్త భవనాన్ని అండర్ గ్రౌండ్ నుంచి రవాణా సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిజానికి కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న డిమాండ్ కొత్తదేం కాదు. ఏడాది కిందట కూడా ఇదే చర్చ పార్లమెంటు బడ్జెట్ కమిటీ సమావేశాంలోనూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న భవనం వారసత్వ నిర్మాణంగా గుర్తింపు ఉండటంతో పాటు.. దీనికి గ్రేడ్ ‘ఐ’ నిర్మాణంగా గుర్తింపు ఉండటంతో దీన్లో మార్పులు చేర్పులు చేయటం ఏ మాత్రం సాధ్యం కాని పరిస్థితి. అందుకే.. అత్యాధునిక పార్లమెంటు నూతన భవన నిర్మాణం చర్చను మరోసారి తెర మీదకు తీసుకొస్తూ.. లోక్ సభ స్పీకర్ తాజాగా లేఖ రాయటంతో.. ‘‘కొత్త పార్లమెంటు’’ అంశం ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా మారిందని చెప్పక తప్పదు.