Begin typing your search above and press return to search.

బాబును మర్చిలేక‌పోతున్న వెంకయ్య‌

By:  Tupaki Desk   |   8 Sept 2017 10:24 AM IST
బాబును మర్చిలేక‌పోతున్న వెంకయ్య‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు మ‌ర్చిపోలేక‌పోతున్నార‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య పార్టీల‌కు అతీత‌మైనా ప్రేమాభిమానాలు ఉన్నాయ‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంటుంది. బీజేపీతో బాబు దోస్తానాకు వెంక‌య్య చొర‌వే కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. బాబుపై మోడీకి అభిమానం అంతంత మాత్ర‌మేన‌ని.. వెంక‌య్య కార‌ణంతోనే ఇప్పుడున్న స్థాయిలో ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు నేత‌లు వ్య‌క్తం చేస్తుంటారు.

రాజ‌కీయంగాను.. వ్య‌క్తిగ‌తంగానూ త‌న‌కెంతో ఆఫ్తుడైన వెంక‌య్య ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు అపూర్వ‌మైన స్వాగ‌త ఏర్పాట్ల‌ను చేశారు చంద్ర‌బాబు.

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి వ‌ర‌కూ భారీ మాన‌వ‌హారాన్ని ఏర్పాటు చేశారు.ఆగ‌స్టు 26న నిర్వ‌హించిన అపూర్వ పౌర‌స‌న్మానాన్ని త‌న జీవితంలో మ‌ర్చిపోలేన‌ని నాటి స‌భ‌లో వెంక‌య్య చెప్పుకున్నారు. నిజ‌మే.. 26 కిలోమీట‌ర్ల పాటు వేలాది మందిని నిల‌బెట్టి.. వారి చేత పూలు చ‌ల్లిస్తే.. ఏ నేత మాత్రం ఆ అభిమానానికి పిధా కాకుండా పోతారు.

అందుకే. ఇన్నిరోజుల త‌ర్వాత కూడా వెంక‌య్య‌కు బాబు చేసిన స‌న్మానం గుర్తుకు వ‌స్తోంది. త‌న‌కు చేసిన స‌న్మానాన్ని తాను ఎప్ప‌టికి మ‌ర్చిపోలేనంటూ స్వ‌ద‌స్తూరితో చంద్ర‌బాబుకు వెంక‌య్య లేఖ రాశారు. స‌ద‌రు లేఖ‌లో వెంక‌య్య ఏం చెప్పారంటే.. మీరు.. మీ మంత్రులు ఏపీ స‌ర్కారు.. తెలుగు ప్ర‌జ‌లు అపూర్వ రీతిలో చేసిన పౌర‌స‌న్మానాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని వెంక‌య్య పేర్కొన్నారు.

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి 26 కిలోమీట‌ర్లు దారి పొడ‌వునా వేలాది మంది విద్యార్థులు.. ప్ర‌జ‌లు.. జాతీయ జెండాల‌తో స్వాగ‌తం ప‌లికిన తీరు.. దృశ్యాలు త‌న మ‌నఃప‌థం నుంచి చెరిగిపోవ‌న్నారు. తాను రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్నా.. రాజకీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉన్నా.. తెలుగు ప్ర‌జ‌ల‌ను తాను మ‌ర్చిపోలేన‌న్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి త‌న ప‌రిధిలో సాధ్య‌మైనంత‌గా కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు.

అంతా బాగానే ఉంది.. మ‌రి అంత ప్రేమ వెంక‌య్య గుండెల్లో ఉంటే.. త‌నకున్న మొత్తం ప‌ర‌ప‌తితో ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదాను ఇప్పిస్తే స‌రిపోతుంది క‌దా. నీతి అయోగ్ వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాను ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న రాష్ట్రాల‌కు ఇక‌పై అమ‌లు కాదంటూనే.. ఇటీవ‌ల జ‌రిగిన క్యాబినెట్ లో ఆయా రాష్ట్రాల‌కు మ‌రో ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదాను ఇచ్చిన తీరును మ‌ర్చిపోలేం. విభ‌జ‌న‌తో ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని హోదాతో భ‌ర్తీ చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలించి.. ఆ దిశ‌గా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకునేలా చేస్తే.. నిజంగానే వెంక‌య్య‌ను ఏపీ ప్ర‌జ‌లు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేరు.