Begin typing your search above and press return to search.

పార్టీ ఫిరాయింపుల పై , క్రిమినల్ కేసులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:34 AM GMT
పార్టీ ఫిరాయింపుల పై , క్రిమినల్ కేసులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు !
X
ప్రస్తుతం రాజకీయ పార్టీలకి ఉన్న అతి పెద్ద సమస్య పార్టీ ఫిరాయింపులు. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువై పోయింది.అసలు ఎవరు , ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకునేలోపే పార్టీ జెండా మార్చేస్తున్నారు. చొక్కాలు మార్చినంత సులువుగా ..పార్టీలని మార్చడం రాజకీయ నేతలకి బాగా అలవాటైపోయింది. దీనిపై తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ ..పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టపరమైన లోపాలను సరిదిద్దాల్సిన అవసరముందని వెంకయ్య తెలిపాడు. ఒక పార్టీ నుంచి గెలిచినవారు మరో పార్టీలో చేరి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినా, వారి పదవీకాలం పూర్తయ్యేంతవరకూ స్పీకర్లు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలేదన్నారు.

ఏదైనా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూడింట రెండొంతుల మంది మూకుమ్మడిగా మరో పార్టీకి మద్దతు తెలిపితే అనర్హత వేటు వేయడానికి వీలు లేకుండా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ రెండు లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అలాగే రాజకీయ నేతలపై నమోదయ్యే క్రిమినల్‌ కేసులని ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని, ఎన్నికల సంబంధిత పిటిషన్లపై సత్వర విచారణకు ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేయాలన్నారు.

ఇదే సమయంలో చట్టసభల్లో సభ్యుల అనుచిత ప్రవర్తనపై ఆయా రాజకీయ పార్టీలే చర్యలు తీసుకోవాలని, సభలోని క్రమశిక్షరహిత దృశ్యాలపై మాత్రమే కాకుండా సభ్యులు వ్యక్తపరిచే మంచి మాటలను, అభిప్రాయాలపై కూడా మీడియా దృష్టిసారించాలని ఆయన సలహా ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు అద్భుత ప్రసంగాలు చేశారు కానీ, వాటిని మీడియా కవర్ చేయలేదని అన్నారు. సభ్యుల ఆందోళనలను మాత్రమే మీడియా ప్రసారం చేస్తోందని, మంచి ప్రసంగాలు ఇచ్చే వారిపైన కూడా మీడియా దృష్టి పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పారు. ఇక రాజ్యసభను దేశం మొత్తం పెద్దల సభగా చూస్తున్నందున సభలో సభ్యులు హుందాగా, క్రమశిక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని ఉప-రాష్ట్రపతి కోరారు.