Begin typing your search above and press return to search.

వెంకయ్య మాట..భారత్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ!

By:  Tupaki Desk   |   31 Aug 2019 10:03 PM IST
వెంకయ్య మాట..భారత్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ!
X
భారత దేశం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనుందంటూ నరేంద్ర మోదీ సర్కారు చెబుతున్న మాటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దన్నుగా నిలిచారు. త్వరలోనే ఈ కల సాక్షాత్కారం కానుందని కూడా వెంకయ్యనాయుడు లెక్కలేసి మరీ చెప్పేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న వెంకయ్య.... శనివారం హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు... భారత ఆర్థిక వ్యవస్థకు సంబందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోదీ సర్కారు నిర్దేశించుకున్న మేరకు 2024 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ)గా రూపాంతరం చెందడం ఖాయమేనని, ఇందుకు సంబంధించిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా వెంకయ్య చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలను ప్రస్తుతం హడలెత్తిస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై మాత్రం పడదని కూడా వెంకయ్య తేల్చేశారు. మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యల కారణంగానే మాంద్యం ప్రభావం పడటం లేదని కూడా వెంకయ్య తేల్చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై విశ్లేషణలు చేస్తున్న పలు దేశాలు, అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు... భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని చెప్పేశాయని కూడా వెంకయ్య వివరించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చూస్తున్నా... వెంకయ్య మాటల్లో నిజం లేకపోలేదన్న మాట కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం 2.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ... 2020 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద కష్టసాధ్యమైన పనేమీ కాదు కదా. అదే సమయంలో 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని - ఆ స్థాయితో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెంకయ్య కూడా ఇవే గణాంకాలను ప్రస్తావిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ సర్కారుకు వెన్నుదన్నుగానే నిలిచారన్న వాదన వినిపిస్తోంది.