Begin typing your search above and press return to search.

చేసినవన్నీ గొప్పవి..చేయనివి..యూజ్‌ లెస్ థింగ్స్!

By:  Tupaki Desk   |   30 July 2017 9:07 PM IST
చేసినవన్నీ గొప్పవి..చేయనివి..యూజ్‌ లెస్ థింగ్స్!
X
‘‘పోయినోళ్లందరూ మంచోళ్లు’’ అని ఓ సినీ కవిగారు ఎన్నడో చెప్పారు. ఆ లెక్కనే కనిపిస్తోంది ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరిస్తున్న తీరు. తాను కేంద్రమంత్రిగా ఉండడం వల్ల పూర్తయిన చిన్న చిన్న పనుల గురించి ఆయన తానేదో మహాద్భుతాన్ని సాధించేసినట్లుగా - అండపిండ బ్రహ్మాండాలను బద్ధలు చేసేసినట్లుగా టముకు వేసుకుంటున్నారు. అదే సమయంలో.. తాను కేంద్రమంత్రిగా ఉండి కూడా చేయకుండా విస్మరించిన పనుల విషయంలో.. అవన్నీ యూజ్ లెస్ థింగ్స్ వాటి గురించి పట్టించుకోవడమే దండగ.. అంతకు మించి ఎంతో చేసేసాం గదా.. అంటూ బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలను వీడిపోతున్న తరుణంలో కూడా ఆయనకు ఈ బుకాయింపులు తప్పడం లేదు.

ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ అనే నిర్ణయం కేంద్రం నుంచి రావాల్సిన నిర్ణయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని టీచర్లకు ఉపయోగపడే నిర్ణయం అది. కేంద్రం నుంచి రావాల్సిన నిర్ణయం గనుక.. ఈ విషయంలో వెంకయ్యనాయుడు చొరవ చూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ ఆ ఫైలు కదిలేలా ఆయన  చూశారు. మొత్తానికి ఆ నిర్ణయం పూర్తయింది. అయితే.. అది చాలా మహాద్భుతమైన దేశ సేవ లాగా, రాష్ట్రానికి ఒరగబెట్టేసినట్లుగా వెంకయ్యనాయుడు చెప్పుకుంటున్నారు.

ఇదే నేత... అనాధలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించే విషయంలో ఎన్ని సార్లు మాట మార్చారో కూడా తెలుగు ప్రజలకు తెలుసు! విభజన చట్టం ఆమోదం పొందడానికి ముందు ప్రత్యేకహోదా అయిదేళ్లు ఇస్తే ఎలా సరిపోతుంది.. కనీసం పదేళ్లయినా ఇవ్వాల్సిందే అంటూ రాజ్యసభలో పట్టుపట్టి ఒప్పించింది వెంకయ్యనాయుడే. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక.. పదేళ్లు ప్రత్యేక హోదా తక్షణం ఇచ్చేస్తాం అంటూ బూటకపు మామీలు చేసింది కూడా వెంకయ్యనాయుడే. ప్రత్యేక హోదా కు కేంద్రం నో చెప్పేసిన తర్వాత.. తనను బాధ్యుణ్ని చేస్తూ వస్తున్న ఆరోపణల గురించి.. ‘హోదా ఏమైనా సర్వరోగనివారిణి జిందా తిలిస్మాత్ అనుకున్నారా’ అంటూ వెటకారాలు చేస్తూ ప్రజలన హేళన చేసింది కూడా ఈ వెంకయ్యనాయుడే. హోదాకు మించి చాలా చేశాం అంటూ ఆయన మాయచేసే ప్రయత్నం చేశారు.

ఆ రకంగా.. తాను చేసిన పనులు మాత్రం చాలా మహాద్భుతమైనవని.. చేయకుండా వదిలేసినవి ఎందుకూ పనికిరాని పనులనీ లౌక్యంగా చాటుకోవడం వెంకయ్యకు మాత్రమే చెల్లుతోంది.