Begin typing your search above and press return to search.

అక్క‌డుంది వెంక‌య్య‌.. టెంప్ట్ కారంతే

By:  Tupaki Desk   |   1 Jan 2018 2:03 PM IST
అక్క‌డుంది వెంక‌య్య‌.. టెంప్ట్ కారంతే
X
దేశంలోని సీనియ‌ర్ నేత‌ల్లో వెంక‌య్య నాయుడు ఒక‌రు. తెలుగు మీడియంలో చ‌దువుకొని కూడా అన్య భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌ట‌మే కాదు.. ఆ భాష‌లకు చెందిన వారు సైతం మాట్లాడ‌లేనంత ముచ్చ‌ట‌గా మాట్లాడే స‌త్తా వెంక‌య్య సొంతం. వెంక‌య్య‌కు ఉన్న ప‌రిమితులు.. ఆయ‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు ఎంత‌న్న‌ది ఆయ‌న్ను ప్ర‌శ్న‌లు వేసే జ‌ర్న‌లిస్టుల‌కు తెలియ‌నివి కావు.

అయినా.. అవ‌కాశం చిక్కిన‌ప్పుడు ఏదో ఒక ప్ర‌శ్న‌తో వెంక‌య్య లోప‌ల ఏమైనా దాగి ఉంటే వాటిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే.. అలాంటి ప్ర‌య‌త్నాలు ఒక ప‌ట్టాన వర్క్ వుట్ అయిన‌ట్లుగా క‌నిపించ‌దు. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది.

దేశంలోనే రెండో అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న వెంక‌య్య‌.. ఆ ప‌ద‌విని చేప‌ట్టిన‌ప్ప‌టికీ త‌న తీరును ఎంత మాత్రం మార్చుకోలేదు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌తి వారాంతంలోనూ అయితే తెలంగాణ‌లో.. లేదంటే ఆంధ్రాలోనో ఏదో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే ఆయ‌న‌.. ఉప రాష్ట్రప‌తి అయ్యాక కూడా త‌న తీరును అస్స‌లు మార్చుకోలేదు.

ఉప రాష్ట్రప‌తి హోదాలో ఉన్న వెంక‌య్య త‌ర‌చూ రావ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు. ఆయ‌న‌కు ఏర్పాట్లు చేయ‌లేక కిందా మీదా ప‌డిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అలాంటి మాట‌లు వెంక‌య్య దృష్టికి వెళ్లాయో లేవో కానీ.. ఆయ‌నేమీ అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా త‌న‌పాటికి తాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నారు.

తాజాగా అలాంటి కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వెంకయ్య‌.. కొంద‌రు మీడియా మిత్రుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఒక‌రిద్ద‌రు మీడియా మిత్రులు వెంక‌య్య‌ను టెంప్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మీ కంటే చిన్న‌స్థాయి నేత‌లు కూడా ప్ర‌ధానుల‌య్యారు క‌దా అంటూ ప్ర‌శ్నించ‌గా.. అలాంటి కోరిక లేదంటూనే దాని గురించి ఎక్కువ మాట్లాడితే అంద‌ని ద్రాక్ష పుల్ల‌న అన్న‌ట్లు ఉంటుంద‌ని.. అందుకే మాట్లాడ‌నంటూ నిరాశ‌ప‌రిచారు.

2020 జ‌న‌వ‌రి 20న తాను రాజ‌కీయాలు వ‌దిలేసి స్వ‌చ్చంద సేవ చేయాల‌నుకున్నాన‌ని.. అందుకే ఢిల్లీ వ‌దిలేసి గ్రామానికి వెళ్లిపోవాల‌నుకున్నా.. 2017 త‌న జీవితంలో మార్పు తెచ్చి ఉప రాష్ట్రప‌తిని చేసింద‌న్నారు. ఎంత అడిగినా.. త‌న‌కు అర్హ‌త లేని వాటి గురించి ఎక్కువ ఆశ ప‌డ‌కుండా.. త‌న‌దైన క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టు త‌ప్ప‌కుండా వ్య‌వ‌హ‌రించే వెంక‌య్య.. ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌ల్ని ఆశించిన‌ విలేక‌రుల్ని మాత్రం నిరాశ ప‌రిచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.