Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌..పురందేశ్వ‌రీ ఒకే మాట చెప్పారా?

By:  Tupaki Desk   |   3 Jun 2017 10:31 PM IST
వెంక‌య్య‌..పురందేశ్వ‌రీ ఒకే మాట చెప్పారా?
X
మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ-టీడీపీల మ‌ధ్య పొత్తు విష‌యంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లు ఇప్ప‌టికే ప‌లు చోట్ల భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తుల్లోని ప‌లువురు సైతం రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త విష‌యంలో ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్ అగ్ర‌నేత‌ల వ‌ద్ద‌కు చేరిన‌ట్లు క‌నిపిస్తోంది. ఒకేరోజు బీజేపీకి చెందిన ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా ఈ కామెంట్లు చేసిన వారిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒక‌రు కాగా బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రీ మ‌రొక‌రు.

మూడురోజుల ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వెంక‌య్య‌నాయుడు నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు - కార్యకర్తలతో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మనకు మిత్రపక్షమని వెంకయ్యనాయుడు బీజేపీ నాయకులతో అన్నారు. వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోనికి తీసుకు వెళ్లడంపై దృష్టి పెట్టాలని వెంక‌య్య‌నాయుడు దిశా నిర్దేశం చేశారు.

కాగా, మ‌రో కార్య‌క్ర‌మంలో కేంద్ర మాజీమంత్రి - బీజేపీ జాతీయ నాయ‌కురాలు పురందేశ్వరీ పార్టీ నేత‌తో మాట్లాడుతూ ఏపీలో జరిగే అభివృద్ధిలో ఎక్కువ భాగం కేంద్రమే చేస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన సంస్థలకు 80 శాతం నిధులు కేంద్రం ఇచ్చినవేనని తెలిపారు. ఈ విష‌యంలో స‌రైన ప్ర‌చారం జ‌ర‌గ‌డం లేద‌న్నారు. అందుకే బీజేపీ శ్రేణులు కేంద్ర ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేయ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అందిస్తున్న స‌హాయ స‌హ‌కారాల‌ను ప్ర‌చారం చేయాల‌ని పురందేశ్వ‌రి సూచించారు. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేయాల‌న్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/