Begin typing your search above and press return to search.

దుమారం: ఆంధ్రులను రాక్షసులన్న తెలంగాణ మంత్రి

By:  Tupaki Desk   |   22 Jun 2021 12:31 PM GMT
దుమారం: ఆంధ్రులను రాక్షసులన్న తెలంగాణ మంత్రి
X
ఏపీ, తెలంగాణ మధ్య 'జలయుద్ధం' మాటల తూటాలు పేల్చుతోంది. ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన ఈ యుద్ధానికి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు దానికి రీకౌంటర్ గా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు. 'తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఊరుకోరని.. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులేనని' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తెలంగాణ మరో మంత్రి శ్రీనివాసగౌడ్ అయితే ఏకంగా రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని.. సీఎం కేసీఆర్ మంచి వారికి మంచోడు.. చెడుస్తే అంతుచూస్తాడని ఏపీకి వార్నింగ్ ఇచ్చేశాడు.

'లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేనన్న' తెలంగాణ మంత్రి వ్యాఖ్యలపై ఏపీ నేతలు భగ్గుమన్నారు. ఏపీ ప్రాజెక్టులపై యుద్ధానికి సిద్దం కావాలన్న తెలంగాణ మంత్రుల పిలుపుపై కర్నూలు టీడీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రజలను లంకవాసులతో పోల్చడంపై కర్నూలు టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వమే కృష్ణా, గోదావరి నీటిని ఇష్టమొచ్చినట్టు దొంగతనం చేస్తోందని ఆరోపించారు.

తాము తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కర్నూలు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం జలచౌర్యం చేస్తూ యుద్ధం చేయాలని మాట్లాడడం దారుణమని వారు పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదంటూ హితవు పలికారు.

ఇలా తెలంగాణ మంత్రులు నోరుపారేసుకుంటే తాజాగా ఏపీ టీడీపీ నేతలు కూడా గట్టి కౌంటర్లు ఇచ్చారు. వీరిద్దరి ఫైట్ ఎటు దారితీస్తుంది? ముదిరి పాకాన పడుతుందా? అన్నది వేచిచూడాలి.